సినిమా హీరోయిన్లు పలు యాడ్స్ లో నటిస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఓ పక్క సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటించి రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. సిటీల్లో ఎక్కువగా హీరోయిన్ల హోర్డింగ్ లు కూడా కనిపిస్తూ ఉంటాయి.వాటికి సిటీ పోలీసుల దగ్గర పర్మిషన్లు వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే గ్రామాల్లో మాత్రం అలాంటి పర్మిషన్లు వంటివి ఏమీ ఉండవు.అక్కడ హీరోయిన్ల ఫోటోలను కూల్ డ్రింక్స్ షాప్ ల దగ్గర.. అలాగే బట్టల షాపులకు కూడా విపరీతంగా వాడుతుంటారు.
అయితే ఓ రైతు మాత్రం తన పంట పొలానికి ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఫోటోలను దిష్టిబొమ్మలుగా వాడుకున్నాడట. దాని వల్ల పంట బాగా పండిందని ఆ రైతు చెబుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు తన రెండు ఎకరాల్లో మిర్చి పంట పండిస్తుంటాడు.అయితే గతంలో పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడట చంద్రమౌళి.
దీనికి నరదిష్టి తగిలడమే అసలైన కారణమని అతను భావించి… టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ ల గ్లామర్ తో కూడుకున్న ఫ్లెక్సీలను దిష్టి బొమ్మలుగా పెట్టాడట. అలా జనాల చూపు మొత్తం పంటలపై కాకుండా ఈ ముద్దుగుమ్మల ఫ్లెక్సీల పై ఉంటుందని.. దాంతో పంట బాగా పండిందని చంద్రమౌళి చెప్పుకొచ్చాడు.