పెళ్లయ్యాక శ్రియా శరణ్ నటించిన తెలుగు సినిమా “గమనం”. ఎప్పుడో 2019లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతూ వచ్చి ఇప్పటికి థియేటర్లలో విడుదలైంది. ఆంధాలజీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. మంచి ఒటీటీ ఆఫర్ ను వదులుకొని మరీ థియేటర్లో రిలీజ్ చేశారు బృందం. మరి సినిమా మీద వారి నమ్మకం ఏమాత్రమో చూద్దాం..!!
కథ: హైద్రాబాద్ లోని ఓ చిన్న ఏరియాలో నివసించే సాధారణ గృహిణి కమల (శ్రియ). ఎప్పటికైనా ఇండియా తరుపున క్రికెట్ ఆడాలని ఆరాటపడే యువకుడు అలి (శివ కందుకూరి), అతడి ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకొని అతడి కోసమే బ్రతికే జరా (ప్రియాంక జవాల్కర్), ఈ ముగ్గురితోపాటు ఓ ఇద్దరు బిచ్చగాళ్ళు. ఈ అయిదుగురి జీవితాలు హైద్రాబాద్ లో కురిసిన భారీ వర్షం, ఆ వర్షం కారణంగా మొదలైన వరదల కారణంగా ఎలాంటి మలుపు తిరిగాయి అనేది “గమనం” కథాంశం.
నటీనటుల పనితీరు: మొదటిసారి శ్రియను గ్లామర్ డాల్ గా కాక పెర్ఫార్మర్ గా చూస్తాం. అలాగే శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ లు కూడా తమ పాత్రల్లో జీవించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ చారుహాసన్ చాలా సింపుల్ గా డామినేట్ చేసేశారు. అయితే.. వీళ్ళందరి పాత్రలు, ఆ పాత్రల తాలూకు పనితనం హైలైట్ అవ్వకపోవడానికి మరో ముఖ్య కారణం సదరు క్యారెక్టర్స్ కు సరైన క్యారెక్టరైజేషన్స్ లేకపోవడం.
సాంకేతికవర్గం పనితీరు: చాన్నాళ్ల తర్వాత ఇళయరాజా ఒక స్ట్రయిట్ తెలుగు సినిమాకి సంగీతం అందించారు. అయితే.. ఆయన సంగీతం సన్నివేశాలను కానీ, సందర్భాలను కానీ ఏమాత్రం ఎలివేట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్ చాలా వీక్. ఆర్ట్ వర్క్ పేలవంగా ఉంది. అయితే.. ఈ మైనస్ పాయింట్స్ ను జ్ణాణశేఖర్ తన సినిమాటోగ్రఫీ వర్క్ తో కవర్ చేయడానికి ప్రయత్నించారు. కొద్దిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే.. కథనంలో సరైన డెప్త్ లేకపోవడం వల్ల ఆయన కష్టం మరియు నిర్మాతగా ఆయన పెట్టిన సొమ్ములు వృధా అయ్యాయనే చెప్పాలి.
దర్శకురాలు సుజనారావు ఎంచుకున్న పాయింట్ లో బోలెడు డెప్త్ ఉంది. అయితే.. ఆ పాయింట్ ను ఎలివేట్ చేసిన కథనంలో ఆ డెప్త్ మిస్ అయ్యింది. ఆంథాలజీగా ఈ తరహా కథను తెరకెక్కించడమే పెద్ద రిస్క్. ఆ రిస్క్ లో నవ్యత లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లేకపోవడం పెద్ద మైనస్. రెండు గంటల లోపు నిడివి ఉన్న సినిమా కూడా బోర్ కొట్టింది అంటే దర్శకురాలిగా సుజనా రావు విఫలమైందనే అర్ధం.
విశ్లేషణ: అలాగే.. ఈ సినిమాను జనాలు మర్చిపోయి చాన్నాళ్ళైంది. సరైన ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్ గా సినిమాను థియేటర్లలో విడుదల చేయడం అనేది కూడా ఒకరకంగా మైనస్. హ్యాపీగా ఒటీటీ రిలీజ్ కి వెళ్ళిపోయి ఉంటే నిర్మాతలకు కనీసం డబ్బులైనా మిగిలేవీ. అదీ లేకపోవడంతో ఇప్పుడు నిర్మాతల “గమనం” ఏమిటో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.