ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రీసెంట్‌గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన తన సినిమా గురించో, లేక కొంతమంది దర్శకుల్లా హీరోలు, హీరోయిన్ల గురించో అనలేదు. కేవలం తన గురించి, తన లైఫ్ గురించి మాత్రమే మాట్లాడారు. అయితే షాకింగ్‌గా ఉండటంతో ఇప్పుడు వాటి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అవసరమైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ సహకరించరు అనేది ఆయన వ్యాఖ్యాల సంక్షిప్త సారాంశం.
Gautham Menon
దర్శకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఓ సినిమా చేసి విడుదల చేద్దాం అనుకుంటే వివిధ కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోతూ వస్తోంది. దీంతో ఆయన ఈ విషయంలో కాస్త అసహనంతో ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం అని చెప్పారు గౌతమ్ మీనన్.
తాను తెరకెక్కించిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా విడుదల విషయంలో సమస్యల వచ్చిన గురించి ఎవరూ స్పందించలేదు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నంచలేదు. అసలు ఇండస్ట్రీ ఆ సినిమనాఉ పట్టించుకోవడం లేదు. ఆ సినిమా గురించి ఎవరికీ తెలియదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే ఆ సినిమా ఇబ్బందుల గురించి అడిగారు. విడుదల చేయడానికి ఓసారి ప్రయత్నించారు కూడా. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. ఎవరూ ఓకే అనలేదు. విడుదల చేయడానికి ముందుకురాలేదు అని చెప్పారు గౌతమ్ మీనన్.
ప్రేక్షకులు ఇంకా నా సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే నేను బతికి ఉన్నాను అని గౌతమ్ మీనన్ ఎమోషనల్ అయ్యారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’. ఏడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కావడం లేదు.