Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ మంది హీరోయిన్స్ ను “మన అమ్మాయి” అని ఓన్ చేసుకుంటారు. ఒకప్పుడు సావిత్రి, ఆ తర్వాత సౌందర్య, శ్రీదేవి వంటి వారికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. అయితే.. వాళ్లందరి తర్వాత హీరోయిన్ అంటే కేవలం పాటలకి లేదా రొమాన్స్ కి మాత్రమే పరిమితం అనే ట్యాగ్ ప్రేక్షకుల మెదళ్లలో స్థిరపడుతున్న తరుణంలో.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అబ్బాయిలు, ఇంట్లో తల్లిదండ్రుల కూడా ఓన్ చేసుకున్న హీరోయిన్ జెనీలియా. “బొమ్మరిల్లు” చిత్రంతో ఆమెను హాసినిగా అందరూ మనసుకి హత్తుకున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ ను పెళ్లాడి సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న జెనీలియా 13 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీకి “జూనియర్” అనే కన్నడ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్న జెనీలియా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!!

Genelia Interview

కుటుంబం ముఖ్యం..
చాలామంది అడుగుతారు.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోయావ్ అని. కానీ.. లైఫ్ అంటే సినిమాలు మాత్రమే కాదు కదా. ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 13 ఏళ్లలో నా పిల్లలతో మంచి టైమ్ స్పెండ్ చేశాను. ఇప్పుడు వాళ్లు వాళ్ల పనులు చేసుకోగలుగుతున్నారు. అందుకే మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాను.

సమంత సినిమాతో మరాఠీ ఎంట్రీ జరిగింది..
నిజానికి మూడేళ్ల క్రితమే (2022) నా రీఎంట్రీ జరిగిపోయింది. తెలుగులో నాగచైతన్య, సమంత నటించిన “మజిలీ” సినిమాని మా ఆయన దర్శకత్వంలో మరాఠీలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో సమంత పాత్రను నేను ప్లే చేశాడు. మరాఠీలోనూ వర్షం సీన్ లో ఎంట్రీ షాట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆరెంజ్ కి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది..
రామ్ చరణ్ తో కలిసి నటించిన “ఆరెంజ్” సినిమా రెండు సార్లు రీరిలీజ్ అయ్యింది అని తెలిసి సంతోషపడ్డాను. నిజానికి అప్పటికంటే ఇప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి.

సౌత్ సినిమాని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడను..
నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది సౌత్ ఇండస్ట్రీ. ఇక్కడ చేసిన పాత్రలు నన్ను ప్రేక్షకులకు చేరువ చేశాయి. ముఖ్యంగా “బొమ్మరిల్లు”లో హాసిని పాత్రను అందరూ ప్రేమించారు. ఇప్పటికీ నన్ను హాసిని బంగారం అని చాలామంది పిలుస్తుంటారు. ముఖ్యంగా లేడీస్ నన్ను ఎంతో ప్రేమిస్తారు. అలాగే “కథ” సినిమాకి నాకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది. అందుకే ఎప్పుడూ నేను సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసిన మాట్లాడను. నాకు ఇప్పుడు ఇంత సంతోషమైన కెరీర్ ఉందంటే దానికి కారణం సౌత్ ఇండస్ట్రీ.

కోట శ్రీనివాసరావు గారు ఒక నట విశ్వవిద్యాలయం..
నా కెరీర్ తొలినాళ్లలోనే కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ వంటివారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుగారితో కలిసి నటించడం నా అదృష్టం. “బొమ్మరిల్లు”లో ఆయన కూతురిగా నటించినప్పుడు నేను చిన్న పిల్లని. ఆయన ఓ నట విశ్వవిద్యాలయం, ఆయన నుండి నటిగా ఎంతో నేర్చుకున్నాను. ఆయన చనిపోవడం నన్ను ఎంతో బాధించింది.

సత్యం సినిమా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగేవారు..
“బాయ్స్” తర్వాత సుమంత్ తో “సత్యం” సినిమా చేస్తుంటే.. “ఎందుకు చేస్తున్నావ్ ఆ సినిమా?” అని చాలామంది అడిగేవారు. నేను ఏ సినిమా చేసినా నాకు నచ్చితేనే చేస్తాను. స్టార్ డమ్ కోసం నేను ఎప్పుడూ సినిమాలు చేయలేదు. అందుకే “సత్యం” అంత పెద్ద హిట్ అయ్యింది.

యూట్యూబ్ పుణ్యమా అని నా సినిమాలు నేను అప్పుడప్పుడు చూసుకుంటాను..
నిజానికి నా పాత సినిమాలు నేను చూసుకోవడానికి పెద్దగా కుదరదు కానీ.. యూట్యూబ్ లో క్లిప్స్ లో వచ్చేవి మాత్రం చూస్తూ “ఆమ్మో బాగానే చేశానే” అని మురిసిపోతుంటాను. మా పిల్లలు నా సినిమాల్లో “వేద్, సితారే జమీన్ పర్” మాత్రమే చూసారు.

బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు..
నా కెరీర్లో ఎప్పుడూ కంగారుపడి సినిమాలు చేయలేదు. ఒకేసారి బోలెడు సినిమాలు చేసేయాలని ఆశపడలేదు. నా మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే చేశాను. అందుకే.. నా సినిమాలు చూసుకుని నేను ఎప్పుడో బాధపడలేదు.

శ్రీలీల డ్యాన్స్ భలే చేస్తుంది..
“జూనియర్” సినిమాలో శ్రీలీలతో కలిసి నటించాను. సీన్స్ తక్కువే అయినా ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంటుంది. శ్రీలీల సినిమాలు నేను చూడలేదు కానీ.. ఆమె డ్యాన్స్ చేసిన సాంగ్స్ అన్ని చూసాను. ఆమె డ్యాన్స్ భలే ఉంటుంది.

తారక్, చరణ్, బన్నీలని ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా చూడడం సంతోషంగా ఉంది..
ఎన్టీఆర్ గిఫ్టెడ్ యాక్టర్. అతను 3 పేజీల డైలాగ్ ను కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని, సింగిల్ టేక్ లో చేసేసేవాడు. రామ్ చరణ్ లో మంచి పాజిటివిటీ ఉంటుంది. ఇక బన్నీ ఫుల్ ఎనర్జిటిక్. వీళ్ళందరితో నేను సినిమాలు చేసినప్పుడు వాళ్లు కూడా అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ పాన్ ఇండియన్ హీరోలు అయిపోయి సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తుండడం చాలా సంతోషాన్నిస్తుంది.

ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చేస్తాను..
నేను తెలుగులో రీఎంట్రీకి రెడీగా ఉన్నాను. కానీ.. ఏదో అలా కనిపించి వెళ్లిపోయే పాత్రలు చేయమంటే మాత్రం అస్సలు చేయను. 5 నిమిషాల పాత్ర అయినా దానికి మంచి ప్రాధాన్యత ఉండాలి.

రితేష్ వల్లే మళ్లీ సినిమాల్లోకి రాగలిగాను..
నిజానికి నేను మళ్లీ సినిమాల్లోకి రావడానికి కారణం నా హజ్బెండ్ రితేష్. తను పిల్లల్ని చూసుకుంటాను అన్నాడు గనుకే ఇలాంటి టెన్షన్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను.

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

 

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus