సూపర్‌స్టార్ కృష్ణ (Krishna), మహేష్ బాబు (Mahesh Babu) లాంటి హీరోలతో టాలీవుడ్‌లో ఘన చరిత్ర సృష్టించిన ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna) హీరోగా తొలి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ‘RX 100’, ‘మంగళవారం’ (Mangalavaaram) లాంటి చిత్రాలతో బోల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
జయకృష్ణ ఈ సినిమా కోసం లండన్‌లో నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. అజయ్ భూపతి ప్రస్తుతం ‘మంగళవారం 2’తో బిజీగా ఉన్నప్పటికీ, జయకృష్ణ డెబ్యూ సినిమాను కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా కథ యాక్షన్, ఎమోషన్ తో యువతను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు.
ఘట్టమనేని కుటుంబం నుంచి ఇప్పటికే అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా ‘హీరో’, ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమాలతో పరిచయమైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా సినిమాల్లోకి రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో జయకృష్ణ ఎంట్రీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూస్తూ, కొన్ని నిర్మాణ అంశాల్లో కీలక సలహాలు ఇస్తున్నాడని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ 2025 చివరి నాటికి మొదలై, 2026లో విడుదల కానుందని అంటున్నారు. అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ చేతిలో జయకృష్ణ డెబ్యూ చేయడం ఘట్టమనేని కుటుంబ అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ఉంది. ఈ సినిమా జయకృష్ణకు టాలీవుడ్‌లో మంచి ఆరంభాన్ని అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.