బాలకృష్ణను సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’గా చూపించి అభిమానుల అలరించారు గోపీచంద్ మలినేని. మాస్ ప్రేక్షకులకు ఏమేం కావాలో అవన్నీ దట్టించి ఫుల్ మాస్ మసాలా సినిమాగా రూపొందించారు. సినిమాలో వీర సింహా రెడ్డిగా బాలయ్య నటన అదిరిపోయింది కూడాను. అయితే నిజానికి బాలయ్య ఆ సినిమాలో వీరసింహా రెడ్డిగా కనిపించాల్సింది కాదట. ఆ మాటకొస్తే ఆ సినిమానే చేయాల్సింది కాదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని ఈ విషయం చెప్పుకొచ్చారు.
‘వీర సింహా రెడ్డి’ సినిమా పట్టాలెక్కడానికి ముందు బాలయ్యకు గోపీచంద్ మలినేని వేరే కథ వినపించాట. అయితే ఆ కథ విషయంలో అంతగా ఆసక్తి చూపించని బాలయ్య.. ‘వీరి సింహా రెడ్డి’ సినిమా కథ విషయంలో ఆసక్తికనబరిచారట. దీంతో ఆ సినిమా కథనే ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు సినిమాగా తీసుకొచ్చాం అని గోపీచంద్ మలినేని తెలిపారు. తొలి కథ సంగతి పక్కనపెట్టకపోతే ‘వీర సింహా రెడ్డి’ లాంటి పవర్‌ఫుల్ సబ్జెక్ట్ వచ్చేది కాదు అని గోపీచంద్ అన్నారు.
అయితే బాలయ్య నో చెప్పిన కథ ఏంటి, అందులో పాత్రల సంగతి ఏంటి అనేది మాత్రం గోపీచంద్ మలినేని చెప్పలేదు. అలాగే ఆ కథ ఇంకా తన దగ్గరే ఉందా? మరోసారి ఆ కథను బయటకు తీసి మరో హీరోకు చెబుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే బాలయ్య నో చెప్పిన కథలు ఇంకో హీరో చేస్తే విజయం అందుకుంటుంది అనే దాఖలాలు లేవు అంటుంటారు. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ అంత బలంగా ఉంటుందని చెబుతున్నారు.
‘వీర సింహా రెడ్డి’ విజయం తర్వాత గోపీచంద్ మలినేని నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు అనే విషయంలో స్పష్టత రాలేదు. అయితే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. గతంలో ఓసారి ఈ కాంబినేషన్ చర్చలోకి వచ్చినా.. అప్పుడు ముందుకెళ్లలేదు.