సినిమా రిలీజ్ రోజు వెళ్లి… టికెట్‌ల కోసం గొడవపడి అరెస్టయిన అభిమానులు మీకు తెలుసా? ఎందుకు తెలియదు మేమూ అలాంటివాళ్లమే అంటారా. ఆ రోజుల్లో అంటూ అప్పటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటారా? అయితే మీ బ్యాచ్‌లోకి యువ దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆయన కూడా మీలాగే, మన లాగే రిలీజ్ రోజునాడు థియేటర్ల దగ్గర గొడవపడి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. చిన్న కోటింగ్ కూడా తీసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే.
ఇదంతా గోపీచంద్ చదువుకుంటున్న రోజుల్లో అనుకున్నారేమో. కాదు కాదు సినిమాల్లోకి వచ్చిన తర్వాతే జరిగింది. ‘సమరసింహా రెడ్డి’ సినిమా రిలీజ్ నాడు ఇదంతా జరిగిందట. ఒంగోలులోని విజయ దుర్గ థియేటర్‌లో సినిమా వేశారట. అక్కడ ఊళ్లో వాళ్లతో కలసి సినిమా చూడాలని గోపీంచంద్ మలినేని వెళ్లారట. అప్పటికే డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి టికెట్‌ల గురించి ఓకే చేసుకున్నారు. దాని కోసం మేనేజర్‌తో మాట్లాడదామని… గేట్ దగ్గరకు వెళ్లారట గోపీంచంద్. ఈలోపు ఓ వ్యక్తి వచ్చిన గోపీచంద్‌ను ఓ వ్యక్తి తోసేశాడట. గోపీచంద్ కూడా అతడిని వెనక్కి నెట్టేశాడట.
ఆ తర్వాత ఆ వ్యక్తి మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోయాడట. ఏమైందో అనుకుంటూ… గోపీచంద్ మలినేని థియేటర్ వాళ్లతో మాట్లాడుతున్నారట. టికెట్‌లు తీసుకుందాం అనుకునేలోపు పోలీసు జీపు వచ్చి ఆగి… గోపీచంద్‌ను అరెస్టు చేశారట. స్టేషన్‌లో పెట్టి… ఒక కోటింగ్ కూడా ఇచ్చారట. అలా సినిమా కోసం వెళ్లి… స్టేషన్‌కి వెళ్లా అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు. అలా ఏ హీరో సినిమాకు వెళ్లి స్టేషన్‌కి వెళ్లాడో… ఇప్పుడు అదే హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు గోపీచంద్ మలినేని. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది. వేటపాలెం నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలో ఆ సినిమా కోసం అనుకున్న ఓ డైలాగ్‌ను కూడా చెప్పేశాడు గోపీచంద్. ‘‘రోడ్డు మీద జింకో,గొర్రో వచ్చిందనుకో ఎవరైనా హారన్ కొడతాడు. అదే సింహం వచ్చిందనుకో హారన్ కాదు కదా, ఇంజిన్ కూడా ఆపేసి కామ్‌గా ఉంటాడు. రేయ్ అక్కడున్నది సింహం రా రేయ్’’ అని డైలాగ్ చెప్పాడు గోపీచంద్ మలినేని.