ఇటు సంగీతం, అటు నటన అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. రెండు విభాగాల్లోనూ ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. హీరోగా ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా, సంగీత దర్శకుడిగా కూడా సినిమాలు ఉన్నాయి. దీంతో రెండూ ఎలా మేనేజ్ చేస్తున్నావ్ బాబూ అంటూ ఆయనను అడుగుతున్నారు అంతా. మరికొందరైతే అన్నీ నువ్వే చేస్తావా అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్ (G. V. Prakash Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు రాసిపెట్టి ఉన్నది ఎలాగైనా సరే నా దగ్గరికే వస్తుంది అనే నమ్మే వ్యక్తిని నేను. అందుకే ఇతరుల కంచాల వైపు చూడను అని స్ట్రాంగ్ కామెంట్ చేశారు. చెప్పడానికి ఈ మాట సాఫ్ట్‌గా ఉన్నా అర్థమయ్యే వాళ్లకు చాలా బలంగా అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతరుల అవకాశాలు లాగేసుకుంటున్నారు ఆయన అనే విమర్శలు ఆ మధ్య వినిపించాయి. దానికే ఇతరుల విషయాల్లో కలగజేసుకోను అని నేరుగా చెప్పారు.
అలాగే సంగీతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం గురించి కూడా జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడారు. సినిమాకు సంగీతం అందించే క్రమంలో ఏఐ సాయాన్ని తీసుకోవడం తప్పేమీ కాదన్నారు. అయితే పూర్తిగా ఏఐపైనే ఆధారపడి సంగీతం చేయడం మాత్రం తప్పు అని చెప్పారు. చనిపోయిన దిగ్గజ గాయకుల స్వరాల్ని ఏఐ సాయంతో ప్రస్తుతం పునర్ సృష్టించడం సినిమాకి ఆకర్షణగా నిలుస్తోంది అని చెప్పారు.
అయితే ఇలా ఒక పాటను సిద్ధం చేస్తే పర్లేదు కానీ.. మొత్తం సినిమా ఆల్బమ్‌నే ఏఐ పాటలతో నింపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎంతో ప్రతిభ ఉన్న గాయకులు చాలా మంది అవకాశాల కోసం బయట ఎదురు చూస్తున్నారని, కుదిరితే వాళ్లకు ఉపాధి అందించే ప్రయత్నం చేయాలి అని కోరారు. ఈ మాటలతో జీవీ ప్రకాశ్ చాలా విషయాలకు క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి.