టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దగ్గర శిష్యరికం చేశారు హను రాఘవపూడి. ఆ తరువాత ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ.. ఓ వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత ‘లై’, ‘పడిపడి లేచే మనసు’ వంటి సినిమాలు తీశారు. ఈ రెండూ కూడా వర్కవుట్ అవ్వలేదు.
సెకండ్ హాఫ్ సరిగ్గా లేకపోవడం వలనే ఈ సినిమాలు ఆడలేదు. దీంతో హను రాఘవపూడిపై ఒక నెగెటివ్ ముద్ర పడిపోయింది. అతడిని హాఫ్ డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నెటిజన్లు ఇలాంటి కామెంట్స్ చేయడం వేరు.. ఇండస్ట్రీ జనాలు వ్యతిరేక ప్రచారం చేయడం వేరు. తనకు ఇదే అనుభవం ఎదురైందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు హను రాఘవపూడి. ‘సీతారామం’ కంటే ముందు తన గురించి ఇండస్ట్రీలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని..
వాళ్లెవరో కూడా తనకు తెలుసని హను రాఘవపూడి చెప్పారు. ”నేను కథ బాగా చెప్తాను, కానీ బాగా తీయనని టాక్ వచ్చింది. అలాంటి ప్రచారం ఎందుకు వచ్చిందో తెలియదు. నన్ను నమ్మకూడదని అన్నారట. నమ్మొద్దు అంటే ఏ విషయంలో నమ్మకూడదు. కథ బాగా రాయలేనా..? దర్శకత్వం చేయలేనా? నాకు ఇప్పటికీ తెలియదు నా గురించి అలా ఎందుకు అన్నారో..? అలా ప్రచారం చేసిన వారెవరో కూడా నాకు తెలుసు.
ఈసారి వాళ్లను కలిసినప్పుడు ఎందుకు నా గురించి ఇలా చెప్పారని కచ్చితంగా అడుగుతా” అంటూ వివరించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారెవరనేది మాత్రం హను రాఘవపూడి బయటపెట్టలేదు. ప్రస్తుతం హను రాఘవపూడికి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయట. కానీ తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నానని.. తరువాతి సినిమాలు ‘సీతారామం’ని మించి ఉంటాయని హను రాఘవపూడి ధీమా వ్యక్తం చేశారు.