తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారానికి సినీలోకం తరలి వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు గ్రేటర్ పరిధిలో సోమవారం 25 లక్షల మొక్కల నాటేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు అన్ని వర్గాల ప్రజా నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎక్కువమంది తరలి వచ్చి వన యజ్ఞం లో పాలు పంచుకున్నారు. ఆదివారం రకుల్ ప్రీతిసింగ్, రాశీ ఖన్నా మొక్కలు నాటారు.
సోమవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున దంపతులు, నిర్మాత డి . సురేష్ బాబు, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం, శ్రీకాంత్, రానా, నిర్మాత, నటి లక్ష్మీ ప్రసన్న, రెజీనా, తదితరులు ప్రకృతిని కాపాడేందుకు పచ్చని బాట పట్టారు. తమ అభిమానులు కూడా వారి ప్రాంతాల్లో మొక్కలు నాటే విధంగా స్ఫూర్తినిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి పుడమి తల్లిని కాపాడు కోవాలని సూచించారు.
తెలంగాణ సీఎమ్ కేసీఆర్ వచ్చే మూడేళ్ళలో రాష్ట్ర మొత్తం మీద 250 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యానికి రాజధానిలో శ్రీకారం చుట్టారు. ఇందుకు ప్రజల నుంచే కాకుండా.. బిజీగా ఉండే సెలబ్రిటీల నుంచి కూడా స్పందన రావడంతో ప్రభుత్వ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.