పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సినిమాలు చేయడం పెద్ద విషయమా అంటే… చిన్న హీరోలకు పెద్ద విషయమే అని చెప్పాలి. స్టార్ హీరోల వెంట పెద్ద ప్రొడ్యూసర్లు తిరగడం మనకు తెలుసు. కొత్తగా వచ్చిన హీరోలకు పెద్ద నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం కొంచెం కొత్తగానే ఉంటుంది. ఇటీవల కాలంలో అలాంటివి చూస్తున్నాం. ఓ మంచి హిట్ అందుకుంటే, ప్రామిసింగ్ యాక్టర్ అనిపిస్తే కుర్ర హీరోలకు పెద్ద నిర్మాతలు అవకాశాలిస్తున్నారు. అలాంటివారిలో కార్తికేయ ఒకరు. ‘ఆర్‌ఎక్స్ 100’ లాంటి సినిమా తర్వాత కార్తికేయ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అయితే ఆ విజయం తర్వాత ‘హిప్పీ’, ‘గుణ 369’, ‘90 ఎంఎల్’ లాంటి నిరాశపరిచిన సినిమాలు చేశాడు. మధ్యలో విలన్‌గా చేసిన ‘గ్యాంగ్ లీడర్’లో అదరగొట్టాడనుకోండి.
పరాజయాలు ఇచ్చిన కనువిప్పుతో కార్తికేయ జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. అయితే ఆ అడుగులు పెద్ద నిర్మాతలతో వేయడం అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ‘చావు కబురుచల్లగా’ అంటూ అల్లు అరవింద్ కార్తికేయను ‘బస్తీ బాలరాజు’గా మార్చాడు. టీజర్లు చూస్తుంటే సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌లా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రబృందం కృషి చేస్తోంది. దాని తర్వాతి సినిమా కూడా అంతే స్పెషల్‌గా ఉండబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే ఆ సినిమా నిర్మాతలు యూవీ క్రియేషన్స్. నిజమే ప్రభాస్ నిర్మాణ సంస్థలో కార్తికేయ నటించబోతున్నాడట.
ప్రస్తుతం కార్తికేయ చేతిలో ‘చావుకబురు..’తో కలిపి మూడు సినిమాలున్నాయి. ఇది కాకుండా ప్రశాంత్ అనే కొత్త దర్శకుడి సినిమా కూడా ఉందట. ఆ సినిమాకు యూవీ క్రియేషన్స్ నిర్మాతగా వ్యవహరించబోతోందట. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యయాయట. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. మార్చి – ఏప్రిల్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. అలాగే మూడు నెలల్లో సినిమా పూర్తి విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట.