తన 25వ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయాలని హీరో నాని కలలు కన్నాడు. ఆయన కలలు, ఆశలపై కరోనా వచ్చి నీళ్లు చల్లింది. ఎప్పుడో మార్చి 25న విడుదల కావాల్సిన వి మూవీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. కరోనా తగ్గుతుంది, థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఎదురుచూసిన దర్శక నిర్మాతలకు నిరాశే ఎదురైంది. నాని బలవంతంతో చాలాకాలం ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు చేసేదేమీ లేక ఓ టి టి విడుదలకు సిద్దపడ్డారు. అమెజాన్ ప్రైమ్ 33-35 కోట్లకు ఈ చిత్రాన్ని కొన్నట్లు వార్తలు వచ్చాయి.
వి మూవీపై పాజిటివ్ బజ్ నేపథ్యంలో ఈ అమౌంట్ ఈజీగానే దిల్ రాజుకు వచ్చేది. ఐతే ఆయన నిర్మాతగా తెరకెక్కుతున్న పవన్ వకీల్ సాబ్, జెర్సీ హిందీ రీమేక్ మూవీ రెండు షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఆయన పెట్టుబడి మొత్తం స్తంభించి పోయింది. దీనితో దిల్ రాజు విడుదలకు సిద్ధంగా ఉన్న వి మూవీని ప్రైమ్ కి అమ్ముకోవడం జరిగింది. ఐతే తాజాగా కేంద్ర గవర్నమెంట్ పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు తెలుస్తుంది.
సెప్టెంబర్ 1 నుండి సినిమా థియేటర్స్ తో పాటు అన్ని సంస్థలు మరియు రవాణాకు కూడా అనుమతి రానుందట. కాబట్టి మరో 10 రోజులు ఆగివుండాల్సింది అనేది నాని వాదనగా తెలుస్తుంది. ఐతే నాని సినిమా బాగా ఆడితే ఓ 50-60 కోట్ల వసూళ్లు సాధించగలదు. కాబట్టి రాజు ఎటువంటి విడుదల ఖర్చులు లేకుండా తన పెట్టుబడికి కొంత లాభంతో అమ్ముకొని సేఫ్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ లో వి విడుదల చేయడం ద్వారా దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడినట్లు అయ్యింది.