నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ మధ్యకాలంలో నాని నటిస్తున్న సినిమాల్లో అతని ట్రేడ్ మార్క్ కామెడీ మిస్ అవుతుంది అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ మూవీతో ఆ లోటు తీరిపోబోతుంది. ‘మళ్ళీ ఇటు వచ్చేసా.. మళ్ళీ అటు వెళ్తా.. నటుడిగా అది నా బాధ్యత.. మీకు అన్ని రకాల సినిమాలు రుచి చూపించాలి’ అంటూ నాని ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
ఈ మూవీ ద్వారా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా టాలీవుడ్ కు పరిచయమవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.కన్నడ జనాలు ఎలాగూ తెలుగు సినిమాలంటే ఇష్టపడతారు కాబట్టి.. అక్కడి జనాలకి ఒరిజినల్ ఫ్లేవర్ అందించాలనే ఉద్దేశంతో ‘అంటే సుందరానికి’ మూవీని అక్కడ డబ్ చేయడం లేదు అని నాని తెలిపాడు. ఇదే క్రమంలో పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్న అతనికి ఎదురైంది.
దానికి నాని బదులిస్తూ.. ‘ పాన్ ఇండియా అంటే కరెక్ట్ డెఫినిషన్ ఏంటి అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక భాషలో విడుదలైన సినిమాని అన్ని భాషల్లోకి డబ్ చేసి అక్కడి జనాలు కంఫర్ట్ గా సినిమాని చూపించడం అని అంతా అంటున్నారు. కానీ నా దృష్టిలో పాన్ ఇండియా సినిమా అనేది వేరు. మన తెలుగులో రూపొందిన సినిమాలను వేరే భాషల్లోని జనాలు తెలుగులోనే చూసి ఒరిజినాలిటీని ఫీల్ అవ్వాలి. అదే నా దృష్టిలో నిజమైన పాన్ ఇండియా సినిమా.
అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం వరుసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. మార్కెట్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల దగ్గరనుండి మిడ్ రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. నాని నటిస్తున్న ‘దసరా’ మూవీని కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.