రామ్… పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అందరూ అతనిని ‘వారియర్’ అని పిలుస్తుంటారు. సైనికుడిలా తన విధిని నిర్వర్తిస్తుంటాడు అని అలా అంటుంటారు. అలాంటి వ్యక్తికి కర్నూలుకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అలాంటి పోలీసు అధికారిని ఊరకనే ట్రాన్స్‌ఫర్ చేయరు కదా… ఏదో కారణం ఉంటుంది. అయితే అక్కడికి వెళ్లిన రామ్‌కి మహాలక్ష్మి కనిపించింది. మామూలు అమ్మాయి అయితే మన హీరో అలా చూసి, ఇలా వదిలేస్తాడు. కానీ అక్కడ విజిల్ మహాలక్ష్మి. ఈ కథేంటి, అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ కథంతా రామ్ – లింగుస్వామి కొత్త సినిమా కథ అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ. రామ్ చేస్తున్న మొదటి బైలింగ్వుల్ సినిమా ఇది. ఈ సినిమా కథ మెయిన్ ప్లాట్ ఇదే అంటున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి… విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో కనిపిస్తుందట. కర్నూలులో రేడియో జాకీగా ఆమె బాగా ఫేమస్ అట. మహాలక్ష్మి ప్రోగ్రామ్స్‌కి చాలా మంది అభిమానులున్నారు. అలాంటి మహాలక్ష్మికి, ఆ పోలీస్ అధికారికీ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో సినిమా అంటున్నారు.
సినిమాలో యాక్షన్‌తోపాటు, ప్రేమ కథకీ ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు దర్శకుడు లింగుస్వామి. చిత్రీకరణ సాగుతోంది. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అని చెబుతున్నారు దర్శకుడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హీరోగా వావ్ అనిపించిన రామ్… ఆ తర్వాత ‘రెడ్’ సినిమా చేశాడు. అది ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో లింగుస్వామి సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా తర్వాత రామ్ పారితోషికం విషయంలో అమాంతం పెంచేశాడు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
‘వారియర్’ సినిమాతో రామ్.. బోయపాటి శ్రీను సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమా కోసం రామ్ ఏకంగా ₹15 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట. గత సినిమాతో పోలిస్తే ₹5 కోట్లు పెంచేశాడు అంటున్నారు. మరి ఆ సినిమా కూడా విజయం సాధిస్తే ఇంకా పారితోషికం పెంచుతాడేమో. ‘వారియర్’ రెండు భాషల్లో తెరకెక్కుతోంది. బోయపాటి సినిమా ఏం చేస్తారో చూడాలి.