తేజ డైరెక్షన్లో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ కుర్రాడు వరుసగా ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తరువాత అతని మార్కెట్ అమాంతం పెరిగింది. ఉదయ్ కిరణ్ సినిమా ఏది విడుదలైనా.. ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చేవి. అయితే కారణాలేంటో ఇప్పటికీ తెలీదు కానీ.. తరువాత అతని సినీ కెరీర్ అమాంతం పడిపోయింది. అంతేకాదు 2014 జనవరిలో ఎవ్వరూ ఊహించని విధంగా అతను ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. ఉదయ్ అంత ఆఘాయిత్యానికి పాల్పడడానికి కారణాలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. అయితే అతని పేరు ఎత్తగానే.. అతని గురించి కొంతమంది సెలబ్రిటీలు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఉదయ్ కిరణ్ తో రెండు సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా తాజాగా ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. “ఉదయ్ కిరణ్‌తో నేను ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరామ్’ సినిమాలు చేసాను. అందులో ‘మనసంతా నువ్వే’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఆ చిత్రాన్ని 2 కోట్లతో నిర్మిస్తే 16 కోట్లు వసూల్ చేసింది.ఇక ‘శ్రీరామ్’ యావరేజ్ గా ఆడినప్పటికీ బాగానే కలెక్ట్ చేసింది. నిర్మాతలు కూడా లాభాలు పొందారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ .. స్టార్ హీరోల వారసులకు కూడా ఉండేది కాదు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథలు ఎంపిక చేసుకుని స్టార్ డం ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఇప్పటికీ అలాంటి హిట్స్ కొడితే ఉదయ్ కిరణ్ మార్కెట్ 400 కోట్లు ఉండేది. అతను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నేను తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.