‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన నటుడు వేణు తొట్టెంపూడి. ‘చిరునవ్వుతో’ ‘హనుమాన్ జంక్షన్’ ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి హిట్లతో ఒకప్పుడు యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే తర్వాత వరుస ప్లాపులు వెంటాడటం.. అటు తర్వాత బిజినెస్ వ్యవరాల కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ‘అతిథి’ అనే వెబ్ సిరీస్లో కూడా నటించాడు.
కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తర్వాత మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు ప్రకటించాడు. అది ఆగిపోయింది.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వేణు తన కెరీర్‌లో ఫేస్ చేసిన ఓ చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ఘటనలో తానొక స్టార్ హీరోని నమ్మి భారీగా నష్టపోయానని, ఆ హీరో మరెవరో కాదు.. జగపతి బాబు అని వేణు చెప్పడం షాకిచ్చే అంశం. ఒకప్పుడు వేణు, జగపతి బాబు మంచి స్నేహితులు.

‘హనుమాన్ జంక్షన్’, ‘ఖుషీ ఖుషీగా’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. వాళ్ల మధ్య మంచి రిలేషన్ ఉండేది. సరిగ్గా అదే సమయంలో ఓ సంఘటన వాళ్ల మధ్య దూరాన్ని పెంచింది.వేణు చెప్పిన దాని ప్రకారం.. ఓ వ్యక్తి డబ్బు అవసరం ఉందని వేణు దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో జగపతి బాబు మధ్యలో జోక్యం చేసుకుని, “నేను గ్యారంటీ, అతనికి డబ్బు ఇవ్వు” అని చెప్పారట.
జగపతి బాబు లాంటి పెద్ద హీరో హామీ ఇవ్వడంతో, వేణు ఏమాత్రం ఆలోచించకుండా ఆ వ్యక్తికి రూ.14 లక్షలు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు.ఆ రోజుల్లో రూ.14 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమని, ఆ డబ్బు పోవడం తనను ఆర్థికంగా దెబ్బతీసిందని వేణు అన్నారు. అయితే, డబ్బు పోయిందని తెలిసినా జగపతి బాబు కనీసం ఫోన్ చేసి పలకరించలేదని, ఆ విషయం గురించి అడగలేదని వేణు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఆయన గ్యారంటీ ఇచ్చారు కాబట్టే నేను డబ్బులిచ్చాను. కానీ ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు నేను జగపతి బాబుతో మాట్లాడలేదు, కలవలేదు. అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు’ అంటూ వేణు ఆవేదన వ్యక్తం చేశాడు.
