తెలుగు వాడైన కోలీవుడ్ నటుడు విశాల్ సేవా దృక్ఫధం గురించి చెప్పాల్సిన పనిలేదు. గొప్ప సమాజ సేవ కలిగిన నటుడాయన. సామాజిక సేవలో భాగంగా ఎన్నో రకాల సహాయాలతో పాటు…అవేర్ నేస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇప్పటికే ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తు న్నాయి. తన సినిమా టికెట్ నుంచి ఓ రెండు రూపాయలు రైతు ఖాతాకి బదిలీ అయ్యేలా చేసిన ఏకైక నటుడాయన. తన సంపాదనలో సగానికి పైగా సహాయ కార్యక్రమాలే ఖర్చు చేస్తారు.
అలాగే పునిత్ రాజ్ కుమార్ మరణానంతరం ఆయన పూర్తిచేయాల్సిన బాధ్యతలు కొన్నింటిని విశాల్ తీసుకున్నారు. పిల్లల చదువు విషయంలో ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదని విశాల్ పునిత్ మరణానంతరం ముందుకెళ్లిన వైనం అందర్నీ కదిలిచింది. చివరికి విశాల్ షూటింగ్ సమయంలోనూ తన సేవాదృక్పధాన్ని చాటినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ తూత్తుకుడి జిల్లాలోని విలాత్తికులం.. కుమారచక్కణపురం.. వీరకాంచీపురం.. ఊశిమేసియాపురం వంటి గ్రామాల్లో 20 రోజులుగా షూటింగ్ జరుపుకుంది.
కుమారచక్కణపురానికి షూటింగ్ కోసం వెళ్ళగా.. ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఉందన్న విషయాన్ని విశాల్ గుర్తించాడు. దీంతో అప్పటికప్పుడు ఆ గ్రామంలో బోరుబావి తవ్వించారు. 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సింథటిక్ వాటర్ ట్యాంకులను అమర్చి.. గ్రామస్తులంతా నీటిని బిందెల్లో పట్టుకునేందుకు వీలుగా ఆరు ట్యాప్‌లను ఏర్పాటు చేయించారు.
ఎన్నో ప్రభుత్వాలు..ఎంతో మంది నాయకులున్నా ఎవరూ చేయలేని పనిని (Vishal) విశాల్ చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తాము చూసిన రియల్ హీరో అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. విశాల్ ఇటీవలే ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.