పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ కావడంతో.. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అంటే అది యాజ్- ఇట్- ఈజ్ గా ఉండదు. ఆయన అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు అందులో ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. అలా అని పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. సరే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు? అందులో హిట్లు ఎన్ని? ప్లాపులు ఎన్ని? అనే విషయాలను తెలుసుకుందాం రండి :
1) గోకులంలో సీత :
పవన్ కళ్యాణ్, రాశీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గోకులతిల్ సీతై’ చిత్రానికి ఇది రీమేక్.
2) సుస్వాగతం :
పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రీమేక్ లకు కేరాఫ్-అడ్రస్ అయిన భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఓ క్లాసిక్ గా కూడా నిలిచింది. ఈ చిత్రం కూడా తమిళ రీమేక్ కావడం విశేషం. అక్కడ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘లవ్ టుడే’ పేరుతో ఈ చిత్రం రూపొందింది.
3) తమ్ముడు :
అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ చిత్రం .. ఓ అనఫిషియల్ రీమేక్. హిందీ చిత్రమైన ‘జో జీత ఓహి సికిందర్’ స్ఫూర్తి తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు.
4) ఖుషి :
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్-టైం-హిట్ అనిపించుకున్న ‘ఖుషి’ కూడా రీమేకే..! దర్శకుడు ఎస్.జె.సూర్య మొదట ఈ చిత్రాన్ని తమిళంలో విజయ్ తో ‘ఖుషి’ పేరుతోనే తెరకెక్కించాడు.
5) అన్నవరం :
పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ‘అన్నవరం’ చిత్రాన్ని కూడా భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసాడు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తిరుపచి’ చిత్రానికి ఇది రీమేక్. అయితే ఇది పెద్దగా ఆడలేదు.
6) తీన్ మార్ :
పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొనె ల ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి ఇది రీమేక్. అయితే తెలుగులో ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
7) గబ్బర్ సింగ్ :
పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దబాంగ్’ కు ఇది రీమేక్ కావడం విశేషం. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేసాడు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కు ఇది కం-బ్యాక్ మూవీ కావడం విశేషం.
8) గోపాల గోపాల :
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకుడు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్. తెలుగులో ఇది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
9) కాటమరాయుడు :
పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా కిశోర్ పార్థసాని (డాలీ) నే దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ ‘వీరం’ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది.
10) అజ్ఞాతవాసి :
పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. ఫ్రెంచ్ మూవీ ‘ది లార్గో వించ్’ చిత్రానికి ఇది అనఫిషియల్ రీమేక్. తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది.
11) వకీల్ సాబ్ :
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ ఇది.అక్కడ అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది.
12) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్- రానా లు హీరోలుగా నటించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే ను అందించారు. ఈ మూవీ కూడా మంచి టాక్ ను దక్కించుకుంది.