స్టార్ హీరో రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రామ్ చరణ్ నటుడిగానే కాక నిర్మాతగా కూడా విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ చరణ్ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు. రామ్ చరణ్ కు విమానయాన కంపెనీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ట్రూ జెట్ పేరుతో రామ్ చరణ్ కు సంబంధించిన ఎయిర్ లైన్ కంపెనీ సేవలను అందిస్తోంది.
ట్రూజెట్ కంపెనీకి రామ్ చరణ్ ఛైర్మన్ గా ఉండగా ఈ కంపెనీలో చరణ్ కు వాటాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఫలితంగా చరణ్ కు నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా ట్రూజెట్ సంస్థ సర్వీసులు ఆగిపోవడంతో ఈ కంపెనీలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2015 సంవత్సరం జులై నెలలో ఈ కంపెనీ సర్వీసులు మొదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వల్ల ఈ కంపెనీ పుంజుకుంటుందని అనుకున్న సమయంలో కరోనా కేసులు పెరగడంతో సమస్యలు ఏర్పడ్డాయి. చరణ్ తో పాటు మరో ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కూడా ఈ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఇతర ఎయిర్ లైన్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ఈ సంస్థకు ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. గతంలో పలు రీజినల్ ఎయిర్ లైన్ కంపెనీలు సత్తా చాటాలనే ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించలేదు.
ట్రూజెట్ కంపెనీ ఆ ఎయిర్ లైన్ కంపెనీల బాటలో నిలవడం గమనార్హం. ట్రూజెట్ కంపెనీ ఉద్యోగులు సైతం పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. మరోవైపు చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన రిలీజ్ కానుంది. చరణ్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా హీరో స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.