దగ్గుబాటి రానా,సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ చిత్రం గత నెల అంటే జూన్ 17న రిలీజ్ అయ్యి… పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్స్ సగానికి సగం పైనే నష్టపోయారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ పై డి.సురేష్ బాబు సమర్పకులు గా వ్యవహరించారు.
ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రూ.14 కోట్లకు విక్రయించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.5 కోట్లు కూడా షేర్ ను రాబట్టలేకపోయింది. దీంతో ‘విరాటపర్వం’ నష్టాలను ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ వారు రవితేజతో చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తీర్చాలని భావిస్తున్నారు అని తెలుస్తుంది. నిజానికి జూన్ 17వ తేదీని ‘రామారావు.. ‘ కోసమే కేటాయించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ ను జూలై 29 కి పోస్ట్ పోన్ చేశారు.
ఇక ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ సరసన రజిష విజయన్, ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.కార్తీ ‘ఖైదీ’ కి సంగీతం అందించిన సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషం. చాలా కాలం తర్వాత తొట్టెంపూడి వేణు ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఆల్రెడీ టీజర్,రెండు, మూడు పాటలు రిలీజ్ చేశారు. వాటికి అంతంత మాత్రం రెస్పాన్స్ వచ్చింది. ‘ఆర్.టి టీం వర్క్స్’ బ్యానర్ పై రవితేజ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.