ఈ ఏడాది కరోనా ప్రజల జీవితాలపై ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ మహమ్మారి కారణంగా అందరూ ఇబ్బందిపడుతూనే ఉన్నారు. సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు కోలుకోగా.. మరికొందరు మృత్యువాతపడ్డారు. ఇప్పుడిప్పుడే జనాలు బయటకొచ్చి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇంకా కరోనా మనమధ్యలోనే ఉందని.. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకునే బయటకి వెళ్లాలంటూ హీరో రామ్ చెబుతున్నారు. లాక్ డౌన్ అనంతరం తారలందరూ షూటింగ్ లు మొదలుపెడితే రామ్ మాత్రం ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తనకు అన్ని అనుభవాలను ఇచ్చిందని చెప్పారు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడిపే ఛాన్స్ వచ్చినా.. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండడం కొంత నిరాశకు గురిచేస్తుందన్నారు. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడం అంత సులువైన విషయం కాదని.. తనకు విసుగొచ్చేసిందని అన్నారు. అంతేకాకుండా.. తన కుటుంబం కరోనా బారిన పడిందని చెప్పారు. అమ్మ, సోదరుడు ఇద్దరికీ కరోనా సోకిందని.. ఈ విషయం తెలిసి చాలా భయపడిపోయానని చెప్పారు.
ముఖ్యంగా తన తమ్ముడికి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని.. దేవుడి దయతో పూర్తిగా కోలుకున్నాడని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ లో ఒంటరి జీవితాన్ని గడిపానని.. తన పెంపుడు కుక్క తోడుగా నిలిచిందని చెప్పారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయని.. కొత్త ఏడాది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తను నటించిన ‘రెడ్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుందని వెల్లడించారు.