ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ మేరకు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) ప్రకటించింది. ఇఫి 2025 పేరుతో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో ఓ వేడుకను నిర్వహించనుంది. ఈ ఏడాది పురస్కారాల్లో అగ్ర కథానాయకులు రజనీకాంత్, బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సినిమా పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిని సన్మానించనున్నారు.
తలైవా, బాలయ్యకు గౌరవం గురించి కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎల్.మురుగన్ ఈ వేడుకల గురించి.. బాలయ్య, తలైవాకు అరుదైన గౌరవం అందించడం గురించి చెప్పుకొచ్చారు. సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్, బాలకృష్ణను సన్మానించనున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి అని మురుగన్ తెలిపారు.

రజనీకాంత్, బాలకృష్ణ అద్భుతమైన నటన, గొప్ప ప్రజాదరణతో దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలను భారతీయ సినిమాకు, ప్రేక్షకులకు అందించారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో సన్మానించనున్నాం అని ఎల్.మురుగన్ చెప్పారు. ‘అపూర్వ రాగంగళ్’తో 1975లో సినిమాల్లోకి వచ్చిన రజనీకాంత్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ ఒకవైపు నటుడిగా అలరిస్తూనే, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనభ్యుడిగా ఉన్నారు. మరోవైపు సామాజిక సేవతో ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘అఖండ 2: తాండవం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఆఖరులో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
