కొండవీటి దొంగ, అభిలాష, జగదేక వీరుడు అతిలోక సుందరి, రుద్రవీణ, రాక్షసుడు, రుద్రనేత్ర వంటి సినిమాల్లోని పాటలు వెనుక మ్యాస్ట్రో ఇళయరాజా మ్యాజిక్ ఉంది. ఇప్పటికీ ఆ పాటలు కొత్త పాటల్లా అనిపిస్తుంటాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం “స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్”. 1991లో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ ఆడియో మాత్రం హిట్టే. అందుకే ఇళయరాజా మళ్లీ తన సినిమాకి సంగీతమందించాలని చిరు ఆశ పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంగీతమందించడానికి ఏ ఆర్ రెహమాన్ ఒప్పుకున్నారు. కానీ అతని బిజీ షెడ్యూల్ కారణంగా పక్కకు తప్పుకున్నారు.
దీంతో ఆ ఛాన్స్ థమన్ కి ఇవ్వాలని చిరు బృందం భావించినప్పటికీ.. అనుభవం తక్కువగా ఉందని చిరు ఆలోచిస్తున్నారు. అందుకే ఇళయరాజాని సంప్రదించినట్లు తెలిసింది. ఇళయారాజాకు “పద్మవిభూషణ్” అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభిమాని అయిన మెగస్టార్ చిరంజీవి టాలీవుడ్ తరఫున ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇళయరాజాను కలిసిన చిరు సైరా గురించి కూడా ప్రస్తావించినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మ్యాస్ట్రో నుంచి సరే అనే సమాధానం వస్తుందని చిరు భావిస్తున్నారు.