ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని మరిచిపోకముందే మరో సీనియర్ స్టార్ హీరోని బాలీవుడ్ కోల్పోయింది. వెటరన్ హీరో రిషి కపూర్ నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో చేర్చారు. గత రాత్రి వరకు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం నేటి ఉదయం విషమించినట్లు తెలుస్తుంది. ఉదయం ఆయన ఆసుపత్రిలో కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ అమెరికాలో చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఫిబ్రవరి నెలలో ఆయన రెండు సార్లు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తన తండ్రిగారు రాజ్ కపూర్ నటించిన మేరా నామ్ జోకర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రిషి కపూర్ వెండితెరకు పరిచయం అయ్యారు. 1973 లోవచ్చిన బాబీ హీరోగా ఆయన మొదటి చిత్రం. కర్జ్, ఏ వాదా రహా, సాగర్, నాగిన, అమర్ అక్బర్ ఆంటోని, ఆప్ కె దీవానే వంటి చిత్రాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి.
ప్రస్తుతం ఆయన వయసుకు దగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. డి డే మూవీలో దావూద్ ఇబ్రహీం ని పోలిన పాత్రలో ఆయన నటన అద్భుతం. ఆయన ఆకస్మిక మరణంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ ప్రముఖులు వారి కుటుంబంకి సానుభూతి తెలుపుతున్నారు.