సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం. యువతలో స్ఫూర్తి నింపే మాధ్యమాల్లో సినిమా ఒకటి. అయితే సినిమాల్లో మంచి, చెడూ రెండూ ఉంటాయి. దేన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనేది మనుషుల మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. తెరపై కనిపించే దానిని కథగా చూస్తే పర్లేదు కానీ అలానే రియల్ లైఫ్ లో ఉండాలంటే కష్టం. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాలో హీరో క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని కొందరు యువకులు హత్య చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పుర్‌లో గాయాల పాలైన శిబు అనే యువకుడు బాబు జగ్గీవన్ రామ్ ఆసుపత్రిలో చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు విషయమేమిటంటే.. జహంగీర్ పూర్‌లో బస్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్స్ బద్నాం పేరుతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. పాపులారిటీ సంపాదించాలనే కోరికతో ఆ ఏరియాలోని కొందరిని బెదిరిస్తూ వాటిని వీడియోలుగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేవారు.
తాజాగా ఈ బ్యాచ్ ‘పుష్ప’ సినిమా చూసి పుష్పరాజ్ లా ఎదగాలని నిర్ణయించుకున్నారు. దానికి శిబు అనే అమాయకుడిని టార్గెట్ చేశారు. అతడిని హింసిస్తూ ఓ వీడియోను తీశారు. దీంతో స్థానికులు ఎంటర్ అయి బద్నాం బ్యాచ్ ను చితకబాది శిబుని హాస్పిటల్ కి తరలించారు. అతడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు. అతని బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.
విచారణలో వారు ‘పుష్ప’ సినిమాతో పాటు ‘బౌకాల్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా ఎదగాలనుకున్నామని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఈ ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం.