దూరదర్శన్ ఛానల్ కోసం రాసుకున్న ఓ సీరియల్ కథని సినిమాగా మలిచి సూపర్ హిట్ కొట్టడం దర్శకుడు పూరి జగన్నాథ్ కు మాత్రమే సాధ్యమైంది. సూసైడ్ చేసుకోవాలని ఒకే స్థలానికి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయి.. అక్కడ ధైర్యం చేసి సూసైడ్ చేసుకోలేక ఓ రూమ్ కు వెళ్ళి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడతారు.అయితే వాళ్ళు చనిపోయే సమయంలో ప్రేమించుకుంటారు. కానీ నిద్రమాత్రలు మింగేయడంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. కాసేపట్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు అనగా ఇంటి ఓనర్ వచ్చి కాపాడుతాడు. అటు తర్వాత వాళ్ళు విడిపోవడం.
విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరికి ఉన్న ప్రేమ మరింత బలపడడం వంటివి జరుగుతాయి. తిరిగి ఒకరినొకరు కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మధ్యలో హీరోయిన్ కు విలన్లు అడ్డుపడడం..మరోపక్క హీరోకి సెకండ్ హీరోయిన్ అడ్డుపడడం… ఆ అవాంతరాలన్నీ అధిగమించి వాళ్ళు కలుసుకునే టైం వచ్చేసరికి హీరోయిన్ మెడలో విలన్ తాళి కట్టేయడం.. వంటివి జరుగుతాయి. ఇలాంటి కథ చెప్తే ఎవ్వరికైనా కామెడీగానే అనిపిస్తుంది. ఏ హీరో అయినా ఈ కథ చేయడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే తన ఫ్రెండ్ నే హీరోగా పెట్టి తీసి సూపర్ హిట్ కొట్టాడు మన పూరి . అతని ఫ్రెండ్ ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్న మన మాస్ మహారాజ్.
ఈ కథని పూరి తెరకెక్కించిన తీరుకి ఎవ్వరైనా మెచ్చుకుని తీరాల్సిందే.చక్రి సంగీతం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. 2001వ సంవత్సరం సెప్టెంబర్ 14 న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తికావస్తోంది. నిజానికి ఈ కథని ముందుగా పవన్ కళ్యాణ్ కు వినిపించాడు పూరి జగన్నాథ్. కానీ పవన్ ఆ టైములో కొంచెం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పూరికి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే రవితేజకి ఈ అవకాశం దక్కింది. ఓ విధంగా రవితేజ ఎదుగుదల ఈ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ మూవీతోనే మొదలైందని చెప్పాలి. ఇక హీరోయిన్ గా ఒకప్పటి హీరోయిన్ ప్రత్యూషని అనుకున్నాడు పూరి. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. దాంతో తనూరాయ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆమె కూడా బాగా నటించింది.