టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ గతేడాది నారప్ప, దృశ్యం2 సినిమాలతో విజయాలను అందుకున్నారు. కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించిన వెంకటేష్ కు చాలాసార్లు రీమేక్ సినిమాలు విజయాలను అందించాయి. విక్టరీ వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అబ్బాయిగారు సినిమాకు ఇ.వి.వి సత్యనారాయణ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. అయితే హీరో కృష్ణ నటించాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వెంకటేష్ చేతికి వచ్చింది.
అబ్బాయిగారు సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎంగ చిన్న రాజా మూవీ రీమేక్ కావడం గమనార్హం. భాగ్యరాజా, రాధ హీరోహీరోయిన్లుగా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఎంగ చిన్న రాజా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు భాగ్యరాజానే దర్శకుడు కూడా కావడం గమనార్హం. ఆ తర్వాత ఎంగ చిన్న రాజా హిందీలో బేట పేరుతో తెరకెక్కి అక్కడ కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.
ఎంగ చిన్న రాజా తెలుగు రీమేక్ లో నటించాలని కృష్ణ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయగా కృష్ణ తల్లి పాత్రలో నటించడానికి వాణిశ్రీ ఒప్పుకోలేదు. కృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తర్వాత కృష్ణ ఈ ప్రాజెక్ట్ విషయంలో డ్రాప్ అయ్యారు. ఈ విషయం రాశీ మూవీస్ నరసింహారావుకు తెలియగా ఆయన కృష్ణ నుంచి 30 లక్షల రూపాయలకు హక్కులు కొనుగోలు చేసి వెంకటేష్ తో అబ్బాయిగారు పేరుతో సినిమాను నిర్మించారు.
చంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వెంకటేష్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు. కొన్ని ఏరియాలలో ఈ సినిమా చంటి సినిమా సాధించిన కలెక్షన్లను క్రాస్ చేసింది. వెంకటేష్ తల్లి పాత్రలో జయచిత్ర నటించగా కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం గమనార్హం.