రజనీకాంత్ సినిమా వచ్చింది అంటే.. రజనీకాంత్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ‘జైలర్’ సినిమా వచ్చాక రజనీ గురించి, యాక్టింగ్ గురించీ, గ్రేస్ గురించి, లుక్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే వీటితోపాటు మరికొందరి గురించి కూడా చెబుతున్నారు. వాళ్లే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుథ్. వీళ్ల గురించి మాట్లాడుకోవడం ఓకే. చాలా సినిమాలకు ఇలా జరుగుతుంటుంది కూడా. అయితే వీరితోపాటు మరొకరి పేరు చర్చలోకి వచ్చింది. ఆయనే వినాయకన్.
రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకు విలన్ అంటే.. ఆ స్థాయిలో ఉండాలి అని అనుకుంటుంటారు. అలానే చాలామంది దర్శకులు వెతుకుతుంటారు కూడా. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అలా ఆలోచించలేదు. పేరున్న నటుణ్ని కాకుండా… విలక్షణ విలనీ కావాలనుకున్నారు. దానికి సమాధానంగా దొరికిన నటుడే ఈ వినాయకన్. తమిళ, తెలుగు సినిమా జనాలకు ఆయన ఓ చిన్న నటుడిగా మాత్రమే తెలుసు. ఓ పది సినిమాలు వరకు ఇక్కడ తెలుగు, తమిళంలో చేసుంటారు వినాయకన్.
అయితే మలయాళంలో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. స్ట్రెయిట్‌గా తెలుగులో వినాయకన్ నటించిన సినిమా అంటే కల్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’నే. ఆ తర్వాత వినాయకన్ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. తమిళంలో అయితే కొన్ని సినిమాలు చేశాడు. అందులో విశాల్ ‘తిమిరు’ / ‘పొగరు’ ఒకటి. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రియా రెడ్డి అసిస్టెంట్‌గా వినాయకన్ కనిపించాడు. వైవిధ్యమైన నడక, యాటిట్యూడ్, యాసతో అలరించాడు. ఆ భాషను ఆ తర్వాత చాలామంది ఇమిటేట్ కూడా చేశారు. అయితే వినాయకన్ (Vinayakan) కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మంచి డ్యాన్సర్, కంపోజర్, సింగర్ కూడా.
1995లో ‘మాంత్రికం’ అనే సినిమాలో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమ్యాడు. ఆ తర్వాత డ్యాన్సర్‌గా చేశాడు. అలా ‘బ్లాక్ మెర్క్యూరీ’ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైకేల్ జాక్సన్‌ని బాగా అనుకరిస్తాడని వినాయకన్‌కి పేరు. అయితే కెరీర్‌లో పెద్ద బ్రేక్ అంటే దుల్కర్ సల్మాన్ ‘కమ్మటిపాదం’ సినిమాతో దక్కింది. ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ‘జైలర్’ ఇచ్చిన పేరు స్టార్ విలన్‌ను చేసేసింది. అది కూడా ఇండస్ట్రీలోకి వచ్చి 28 ఏళ్ల తర్వాత.