సినిమా వసూళ్లు చెబితే నమ్మేలా ఉండాలి.. డౌట్ పడేలా ఉండకూడదు అంటారు. ఇప్పుడు ఇదే చర్చ ‘దేవర’ (Devara) వసూళ్ల విషయంలో జరుగుతోంది. అయితే సినిమాకు అంత వసూళ్లు రాలేదా అంటే బాగానే వచ్చాయి. కానీ వాళ్లు చెబుతున్నంత రాలేదు.. సినిమాకు హైప్ కోసం అంత చెబుతున్నారు అని ఓ వాదన వినిపిస్తోంది. దానికి సాక్ష్యంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా వసూళ్ల సంఖ్య, తెగిన టికెట్ల సంఖ్య చెబుతున్నారు. ఆ లెక్కన అంత వసూళ్లు కష్టమే అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?
Devara
తారక్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ . రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి పార్టు సెప్టెంబరు 27న విడుదలైంది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు వసూలు చేసింది అని టీమ్ అనౌన్స్ చేసింది. ఇక రెండు రోజులు పూర్తయ్యేసరికి ఆ లెక్క రూ.243 కోట్లకు చేరింది. అంటే రెండో రోజున రూ. 71 కోట్లు వచ్చాయి. అయితే తొలి రోజు తెగిన టికెట్లు.. వచ్చిన వసూళ్ల లెక్క సరిపోవడం లేదు అని అంటున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్లు 12.8 లక్షల తెగితే రూ. 191.5 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇక ‘దేవర’ సినిమాకు ఆరు లక్షల టికెట్లు తెగితే రూ. 172 కోట్లు వచ్చాయి అని చెబుతున్నారు. దీంతో అంత డిఫరెన్స్ ఎలా సాధ్యం అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పోనీ టికెట్ ధరలు ఎక్కువ పెట్టారా? అంటే రెండూ దాదాపు సమానమైన ధరలే అని చెబుతున్నారు.
దీంతో ‘దేవర’ వసూళ్లు నిజమేనా? అనే ప్రశ్న వైరల్ అవుతోంది. మరోవైపు డివైడ్ టాక్ వస్తున్నా ఆదివారం నాడు సినిమాకు హౌస్‌ఫుల్స్ పడ్డాయి అని చెబుతున్నారు. అయితే సోమవారం వసూళ్లతో సినిమా ఫలితం మీద క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.