ఎవరూ ఊహించని విధంగా ‘వార్ 2’తో బాలీవుడ్ బాట పడుతున్న తారక్.. ఇప్పు మరో అడుగు ముందుకేసి హాలీవుడ్ సినిమా కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడా? ఏమో అతని చర్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ జరిగింది. దానికి అమెజాన్ స్టూడియోస్ (అంతర్జాతీయ) వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫేరెల్ సహా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు విచ్చేశారు. దీంతో తారక్ హాలీవుడ్ సినిమా అనే చర్చ నడుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన తారక్.. ఆ తర్వాత ఆ సినిమా విదేశాలకు వెళ్లేసరికి ఇంటర్నేషనల్‌గా గుర్తింపు పొందాడు. ఆస్కార్ ప్రచారంలో భాగంగా విదేశాల్లో తిరిగి ఇంకా దగ్గరయ్యాడు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే.. మరోవైపు ఎన్టీఆర్‌ను కలవడం కోసం అమెజాన్ లాంటి పెద్ద సంస్థ ప్రతినిధి వచ్చారు. దీంతో తారక్ హాలీవుడ్ సినిమా అనే చర్చ ఎక్కువైంది. బాలీవుడ్ ఓకే అయిపోయింది కాబట్టి.. ఇప్పుడు హాలీవుడ్ ఆలోచన అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అమెజాన్ స్టూడియోస్, ఇంటెర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేమ్స్ ఫెరెల్.. తారక్‌ను కలవడం కోసమే అమెరికా నుండి వచ్చారట. ఆయన వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రసీమలో తనకు సన్నిహితమైన కొంతమందిని పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్. దీనికి రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, శోభు యార్లగడ్డ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, శిరీష్, స్వప్న దత్, సూర్యదేవర నాగవంశీ తదితరులు వచ్చారని టాక్.
ఇదంతా ఒకే.. అసలు జేమ్స్ ఎందుకు వచ్చారు అనేదే ఇక్కడ ప్రశ్న. అమెజాన్‌తో కలసి తెలుగు నిర్మాతలు ఎవరైనా తారక్ (Jr NTR) హీరోగా ఇంగ్లిష్ సినిమా చేస్తారా? లేక తారక్ సినిమాలను అమెజాన్ ఏమన్నా గంపగుత్తగా తీసుకుంటుందా అనేది చూడాలి. బాలీవుడ్‌లో ఇలా ఓ డీల్ అయ్యింది కూడా. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. మరికొందరైతే కొరటాల శివ సినిమాను అమెజాన్ తీసుకుంటోంది అని అంటున్నారు. అయితే ఓ సినిమా కోసం ఆయన ఇంత దూరం వస్తారా అనేది డౌట్.