కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోను సినిమాలోకి తీసుకొని ఓ వారం షూటింగ్ చేశారు. అందులోనూ ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం అని అంటున్నారు. ఇంకో విషయం ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ మూడు అంశాలు వింటే ఏం అర్థమవుతోంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉండి ఉండాలి, లేదంటే సినిమాకు ఇంకో పార్టు ఉండాలి. పైన చెప్పిన వివరాల ప్రకారం ఆ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ అని మీకు అర్థమయ్యే ఉంటుంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి’. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు ఇటీవల టీమ్ ఘనంగా అనౌన్స్ చేసింది. అయితే ఒక్క చిన్న క్లారిటీ మాత్రం మిస్ అయ్యింది. అదే ఈ సినిమా తొలి పార్టును రిలీజ్ చేస్తున్నారా? లేక మొత్తం సినిమానా అనేది. ఎందుకంటే పైన చెప్పినట్లు ఈ సినిమా ఒక్క పార్టులో కాదు, రెండు పార్టుల్లో వస్తోందని చెబుతున్నారు. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల కాన్సెప్ట్ చూస్తుంటే… రెండు భాగాలు అని అర్థమైపోతుంది. ‘పుష్ప’, ‘సలార్’, ‘దేవర’ ఇలా చాలా సినిమాలు రెండు ముక్కలు కాన్సెప్ట్‌లోనే వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ రెండు పార్టుల స్టైల్‌ను ఎంచుకుంటున్నాయి. అలా ‘కల్కి’ కూడా టూ పార్ట్స్ అంటారు అని అనుకున్నారు ఫ్యాన్స్. అనుకున్నట్లుగానే సినిమా మొదలై చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో అంత తక్కువ సేపు షూటింగ్ ఉండదు కాబట్టి రెండో పార్టు కోసమేమో అని అనుకున్నారు.
కానీ ఇప్పటివరకు ‘కల్కి’ (Kalki) టీమ్ నుండి రెండు ముక్కల న్యూస్ అధికారికంగా రావడం లేదు. చూస్తుంటే సినిమా క్లైమాక్స్‌లోనే ఈ వియం అఫీషియల్‌గా చెప్పేలా ఉన్నారు. లేదంటే సినిమా రిలీజ్‌కు ముందు ప్రచారంలో ఏమన్నా రివీల్ చేస్తారేమో చూడాలి. మరి నాగ్ అశ్విన్ మనసులో ఏముందో?