టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త కథల కోసం ఎదురు చూస్తూ భారీ బడ్జెట్ సినిమాలకు సిద్ధమయ్యే నిర్మాతల్లో దిల్ రాజు (Dil Raju) ముందు వరుసలో ఉంటారు. గతంలో జటాయు అనే ప్రాజెక్ట్‌ను ప్రకటించి, దీనిని విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) చేయాలని అనుకున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకత్వంలో రూపొందే ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. అయితే అనుకున్నట్టుగా పని జరగకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కక ముందే భారీ మార్పులకు గురైంది.
ఇందుకు ప్రధాన కారణం స్క్రిప్ట్ అని టాక్. మోహనకృష్ణ ఇంద్రగంటి కథను డెవలప్ చేసినప్పటికీ, దిల్ రాజు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, స్క్రీన్‌ప్లేపై ఇంకా పలు అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫాంటసీ సినిమాకు కమర్షియల్ యాంగిల్ ఉండాలనే దృక్కోణంలో స్క్రిప్ట్ పూర్తిగా సెట్ కాలేదని భావించారట. దాంతో, ముందుగా అనుకున్న హీరో, దర్శకుడితో కాకుండా కొత్త కాంబినేషన్‌లో సినిమాను ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్.
మరోవైపు, విజయ్ దేవరకొండ లైగర్ (Liger) ఫ్లాప్ కావడం కూడా ఈ నిర్ణయానికి ప్రేరేపించినట్లు తెలుస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెందడంతో, విజయ్‌కు ఇలాంటి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ ఇవ్వడం ప్రస్తుతానికి సేఫ్ కాదని దిల్ రాజు భావించారట. అందుకే, కథను మరింత గ్రిప్పింగ్‌గా మార్చి, మరింత పెద్ద స్కేల్‌లో తెరకెక్కించేందుకు కొత్త హీరోను తీసుకురావాలని డిసైడ్ చేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ప్రభాస్ కోసం అనుకుంటున్నట్లు సమాచారం. పాన్ వరల్డ్ మార్కెట్ ఉన్న ప్రభాస్‌తోనే (Prabhas) ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని, స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్ గా మలచేందుకు కొత్త రచయితలను కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ఓ కొత్త దర్శకుడి పేరును పరిశీలనలో పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంత భారీ మార్పుల తర్వాత జటాయు ఎలాంటి రూపంలో సెట్స్ పైకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.