అగ్ర హీరోలు ఏడాదికో సినిమా చేస్తే ఎలా? వెంటనే వెంటనే సినిమాలు చేయాలి. అప్పుడే ఇండస్ట్రీకి మంచిది అనే మాట మీరు వినే ఉంటారు. ఇది ఇప్పటి మాట కాదు. ఎప్పుడో ఏడాదికి ఒకటి వస్తున్నప్పుడు అన్న మాట. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అలాగే సినిమాలు తెరకెక్కించడంలో స్టైల్ కూడా మారిపోయింది. దీంతో కొంతమంది హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి నుండి రెండేళ్లకు, మూడేళ్లకు ఒకటి అనేలా మారిపోయింది.
ఇప్పుడు ఇలా చిక్కుకున్న హీరోల్లో రామ్‌చరణ్ (Ram Charan) ఒకడు. ‘ఆర్‌ఆర్ఆర్’తో (RRR) మూడేళ్లకు వచ్చిన చరణ్… ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో (Game Changer) చాలా నెలలుగా కుస్తీ పడుతున్నాడు. అయితే.. ఈ సినిమాల ఆలస్యం నుండి పాఠాలు నేర్చుకుని త్వరగా సినిమాలు ఓకే చేసి, త్వరగా షూటింగ్ చేసి, త్వరగా రిలీజ్ చేస్తాడేమో అని అనుకుంటే… ఇప్పుడు ఆయన ఓకే చేసిన రెండు సినిమాలు, వాటి దర్శకులు సినిమాను ఓపికగా చెక్కేవాళ్లే. అవును కావాలంటే మీరే చూడండి.
‘గేమ్ ఛేంజర్’ను శంకర్ (Shankar) చాలా నెలలుగా చెక్కుతున్నారు. ఆ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) (RC16/Peddi) దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) సానా కూడా సినిమా విషయంలో చాలా టైమ్ తీసుకుంటారు అని టాక్. ఇక ఆ తర్వాతి సినిమా సుకుమార్‌తో (Sukumar) చేస్తానని రామ్‌చరణ్ అనౌన్స్ చేసేశాడు. ఇక లెక్కల మాస్టారి సంగతి మనకు తెలిసిందే. సినిమా రిలీజ్‌కు ముందు రోజు రాత్రి కూడా ఎడిటింగ్ టేబుల్ మీద కుస్తీలు పడుతుంటారు.
ఇంకేదో మార్పు చేయాలి, ఇంకేదో యాడ్ అవ్వాలని కుతూహలంతో ఉంటారు. అలాంటి వ్యక్తి అనుకున్నట్లుగా ఏడాదిలో సినిమా తీసి రిలీజ్ చేస్తారని అనుకోలేం. దీంతో ఈ మగ్గురు చెక్కే వీరుల మధ్య రామ్‌చరణ్ ఇరుక్కున్నాడా అనే ప్రశ్న మొదలైంది. ఒకవేళ ఇరుక్కుంటే ఆర్‌సీ 18 సినిమా ఓపెనింగ్ అవ్వడానికి కనీసం ఐదేళ్లు.. గరిష్ఠంగా 7 ఏళ్లు పడుతుంది అని జోకులు వినిపిస్తున్నాయి. మరి వింటున్నావా బర్త్‌డే బాయ్.