“హుషారు (Husharu) , రౌడీ బాయ్స్ (Rowdy Boys)” లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) తెరకెక్కించిన తాజా చిత్రం “ఓం భీమ్ భుష్” (Om Bheem Bush). సూపర్ హిట్ కాంబో శ్రీవిష్ణు (Sree Vishnu),-ప్రియదర్శి (Priyadarshi)-రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ మొదలుకొని ట్రైలర్ వరకూ యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: క్రిష్ & కో (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. ఎలాంటి వెధవ పని అయినా కలిసే చేస్తారు. ముగ్గురిలో కాస్త కామన్ సెన్స్ ఉన్నోడు ప్రియదర్శి. కాలేజ్ నుండి బలవంతపు డాక్టరేట్లు అందుకున్న ఈ ముగ్గురూ.. డబ్బులు సంపాదించుకోవడం కోసం భైరవపురంలో “బ్యాంగ్ బ్రోస్” పేరుతో ఏ టు జెడ్ సోల్యూషన్స్ పేరుతో ఒక క్యాంప్ మొదలెట్టి.. లంకె బిందెల నుండి దెయ్యం వదిలించడం వరకూ అన్నీ చేస్తుంటారు.
కట్ చేస్తే.. భైరవపురంలోని సంపంగి మహల్ లో దెయ్యాన్ని తరిమికొట్టి.. ఆ కోటలోని కోట్ల రూపాయల విలువ చేసే సొమ్ముని సాధించేందుకు ఒప్పుకుంటారు బ్యాంగ్ బ్రోస్. ఇంతకీ సంపంగి మహల్ లో ఉన్న ఆ సంపంగి ఎవరు? ఎందుకని ఆ కోటలోనే ఉండిపోయింది? వంటి ప్రశ్నలకు లాజిక్ లేకుండా కామెడీగా చెప్పిన సమాధానాల సమాహారమే “ఓం భీమ్ భుష్” చిత్రం.
నటీనటుల పనితీరు: బయట మాట్లాడడానికి కూడా చాలా సిగ్గుపడే శ్రీవిష్ణు ఈ తరహా పాత్రల్లో ఎలా ఒదిగిపోతాడు అనే విషయాన్ని ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుండు. మొన్న “సామజవరగమన”లో (Samajavaragamana) తన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించిన శ్రీవిష్ణు ఈ చిత్రంలో అంతకుమించిన ఎనర్జీ & టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీవిష్ణు పంచులు భీభత్సంగా వర్కవుటయ్యాయి.
అలాగే.. రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శ్రీవిష్ణు కౌంటర్లకి రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అయ్యే తీరు హిలేరియస్ గా వర్కవుటయ్యింది. ఇక ప్రియదర్శి మరోమారు తన నటనతో ఆకట్టుకున్నాడు. ముగ్గిరికీ సమానమైన కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ.. ఎక్కువ పంచులు శ్రీవిష్ణు & రాహుల్ కి వర్కవుటయ్యాయి. రచ్చ రవికి (Racha Ravi) మరోమారు మంచి పాత్ర పడింది. మనోడి టైమింగ్ & తింగరితనం భలే పేలింది.
ఇక బోలెడు మంది ఆర్టిస్టులు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. ఎవరూ పెద్దగా రిజిష్టర్ అవ్వలేదు. ఆడ దెయ్యం పాత్ర పోషించిన నటి(?!) మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుకోగా.. శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) పర్వాలేదనిపించుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీహర్ష కొనుగంటి మాటలు ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. పంచ్ డైలాగులన్నీ టపాసుల్లా పేలాయి. దిల్ రాజు (Dil Raju) “వారిసు” (Varisu) చెన్నై ప్రీరిలీజ్ ఈవెంట్ స్పీచ్ మొదలుకొని ఆదిపురుష్ (Adipurush) వరకూ దేన్నీ వదలలేదు. దాదాపుగా ఓ నెల ముందు వరకూ వచ్చిన మీమ్స్ అన్నీ సినిమాలో వినిపిస్తాయి. అందువల్ల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆడియన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా శ్రీవిష్ణు & రాహుల్ రామకృష్ణ డైలాగులకి యూత్ ఆడియన్స్ థియేటర్లలో హల్ చల్ చేయడం ఖాయం.
నిజానికి సంభాషణాల్లో లెక్కలేనన్ని బూతులున్నాయి. అయితే.. అవెక్కడా శ్రుతి మించి, గీత దాటకుండా చూసుకున్నాడు శ్రీహర్ష. దర్శకుడిగానూ తనదైన మార్క్ తో అలరించాడు. కానీ.. కథకుడిగా మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్టాఫ్ హిలేరియస్ గా రాసుకున్న శ్రీహర్ష సెకండాఫ్ ను మాత్రం ఎమోషనల్ గా ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫస్టాఫ్ మొత్తం టీ20 లాగా దూసుకెళ్లిన సినిమా.. సెకండాఫ్ కి వచ్చేసరికి టెస్ట్ మ్యాచ్ లా సహనాన్ని పరీక్షించింది. అలాగే.. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది.
సన్నీ ఎం.ఆర్ (Sunny M.R.) సంగీతం వినసోంపుగా ఉంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. రాజ్ తోట (Raj Thota) సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది కానీ.. అతడి మార్క్ ఎక్కడా కనిపించలేదు, అంత స్కోప్ కూడా కథలో లేదనుకోండి. ప్రొడక్షన్ డిజైన్ లో చాలా రాజీపడ్డారు, ఈ తరహా కాన్సెప్ట్ కు అంత బడ్జెట్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. చాలా గ్రీన్ మ్యాట్ సీన్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ: లాజిక్, బుర్ర పక్కనపెట్టేసి ఓ రెండు గంటలు హ్యాపీగా గ్యాంగ్ తో ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి మంచి ఆప్షన్ “ఓం భీమ్ భుష్”. శ్రీవిష్ణు-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణల నడుమ కెమిస్ట్రీ & వారి కాంబినేషన్ పంచులు హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. సెకండాఫ్ & క్లైమాక్స్ కూడా “మ్యాడ్” (MAD) రేంజ్ లో ఉంది. అసలే రెండు వారాలుగా సరైన సినిమా లేదు, ఎగ్జామ్స్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ ఏ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికీ ఈ చిత్రం మంచి టైమ్ పాస్.