ఆర్ఆర్ఆర్ (RRR) డాక్యుమెంటరీ ‘RRR: Behind and Beyond’ థియేటర్లలో విడుదల చేస్తున్నారు అనగానే భిన్నమైన అభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పరిమిత స్క్రీన్లలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల సపోర్ట్ అంతగా లభించలేదు. డాక్యుమెంటరీని ప్రమోషన్ లేకుండా విడుదల చేయడం కూడా ప్రేక్షకులకు ఆరంభంలో ఆ విషయాన్ని పెద్దగా తెలియజేయలేదు. మరోవైపు పుష్ప 2కి ఇంకా రెస్పాన్స్ తగ్గలేదు. అలాగే సంధ్య థియేటర్ ఘటన కూడా బాగా హైలెట్ అవ్వడంతో RRR డాక్యుమెంటరీ పై ఫోకస్ లోకి రాలేదు.
RRR
ఆ ప్రభావం కూడా కనిపించింది. ఈ డాక్యుమెంటరీ 1 గంట 40 నిమిషాల నిడివితో, ఆర్ఆర్ఆర్ మేకింగ్ వెనుక జరిగిన కష్టాలు, ప్రత్యేక సన్నివేశాల వెనుక విశేషాలను బాగా వివరించింది. చరణ్ (Ram Charan) ఇంట్రో ఫైట్, తారక్ (Jr NTR) పులితో తలపడే సీక్వెన్స్, ఇంటర్వెల్ సన్నివేశం, నాటు నాటు పాట పుటేజ్ వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. క్లైమాక్స్ సీన్లను గ్రీన్ మ్యాట్‌లో ఎలా షూట్ చేశారనే విషయాలు కూడా ఇందులో చూపించారు.
ప్రత్యేకంగా చిత్ర బృంద సభ్యుల ఇంటర్వ్యూలతో కలిపి చాలా అరుదైన వీడియో క్లిప్పింగ్‌లను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ లేకపోవడం, 200 రూపాయల టికెట్ ధరతో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడం కష్టంగా మారింది. ‘‘ఓటీటీలో ఉండాల్సిన కంటెంట్‌ను థియేటర్లలో విడుదల చేస్తారా?’’ అంటూ ప్రేక్షకులు ప్రశ్నించారు.
దీంతో కేవలం ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్, చరణ్-తారక్ అభిమానులే ఈ డాక్యుమెంటరీని ఆసక్తితో చూశారని చెప్పవచ్చు. వసూళ్లపై పెద్దగా గమనించకపోయిన ఈ డాక్యుమెంటరీ ఓటీటీలో విడుదల చేస్తే మాత్రం భారీ వ్యూస్ సాధించగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ కాని ఫుటేజ్‌తో పాటు ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అన్‌సీన్ కంటెంట్ కోరుకుంటుండగా, ఈ డాక్యుమెంటరీ ఆ అవగాహనను కొంత మేర తీరుస్తోంది.