సినిమా పోస్టర్ చూసి, పోస్టర్‌లోని డిటైల్స్ చూసి కథను చెప్పేస్తున్నారు మన సినిమా జనాలు. ఈ టాలెంట్ కొత్తగా వచ్చిందేం కాదు చాలా ఏళ్లుగా ఉన్నదే. అయితే ఇప్పుడు కథ కాదు ఏకంగా ఆ సినిమా కథ ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కోసారి ఆ అంచనాలు కరెక్ట్ అవుతున్నాయి కూడా. అలా ఇప్పుడు కూడా ఓ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే ‘గోట్’. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రమిది.
‘కస్టడీ’ తర్వాత చాలా గ్యాప్ వస్తుందేమో అని అనుకుంటుంటే విజయ్‌తో సినిమా అనౌన్స్ చేసి వావ్ అనిపించారు వెంకట్ ప్రభు. తన కథల్లో, సినిమా తీయడంలో వైవిధ్యమే ఆయనకు వెంటనే కొత్త ప్రాజెక్ట్ ఇచ్చింది అని చెప్పాలి. అలా ఆయన చేస్తున్న చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒకటి నడి వయసు వ్యక్తి కాగా, రెండోది యుక్తవయసులో ఉన్న హీరో. దీనికి సంబంధించి షూటింగ్ చివరి దశకు రావడంతో టీమ్ టైటిల్‌ను, పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఆ పోస్టర్‌ను చూసి అభిమానులు రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. తండ్రీ కొడుకులుగా (Vijay) విజయ్ ఇలా కనిపిస్తారు అని అంటుంటే, మరికొందరేమో టైమ్ ట్రావెల్‌లో ఇద్దరూ ఇలా కలుస్తారు అని లెక్కేస్తున్నారు. అయితే ఇవేవీ కాకుండా ఈ సినిమా హాలీవుడ్ పిక్చర్‌కి రీమేక్ అంటూ మరో వాదన తీసుకొస్తున్నారు. ‘గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం (GOAT)’ అనే పేరుతో రానున్న ఈ సినిమా అర్ధాంతరంగా అదృశ్యమైన డిబి కూపర్ అనే పైలట్ బయోపిక్ అని చెబుతున్నారు. మరికొందరు అయితే ‘జెమినీ మ్యాన్’కు రీమేక్ అంటున్నారు.
ఓసారి ఫ్లైట్ ఫ్లయింగ్‌లో ఉండగా ఒక పెద్ద బ్యాగులో బంగారం, డబ్బుతో ప్యారాచూట్ వేసుకుని ఓ వ్యక్తి దూకి పారిపోతాడు. ఎఫ్‌బీఐ చాలా ఏళ్లు చేపట్టిన పరిశోధనలో ఈ విషయం తేలుతుంది. ఆ కథనే ఈ సినిమా అంటున్నారు కొందరు. అచ్చం తనలాగే ఉండే తన క్లోన్‌తో హీరో పోరాటంతో తెరకెక్కిన సినిమా ‘జెమినీ మ్యాన్’. విల్ స్మిత్ మూడు పాత్రల్లో నటించిన ఆ సినిమా భారీ విజయం అందుకుంది. ‘గోట్’ విషయంలో క్లారిటీ రావాలంటే వచ్చే దివాళీ వరకు ఆగాల్సిందే.