శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత ఈ సినిమాతో హిట్ కొట్టారు శర్వానంద్. అయితే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ను ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’కి లింక్ చేస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘ఒకే ఒక జీవితం’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల స్టోరీ ఒకటేనట. ‘ఒకే ఒక జీవితం’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. తన తల్లిని బతికించుకోవడం కోసం టైం ట్రావెల్ చేసి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తాడు హీరో.
అదే పాయింట్ తో ‘ప్రాజెక్ట్ K’ రూపొందుతుందని సమాచారం. ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో టైం ట్రావెల్ అనే పాయింట్ బాగానే చూపించారు. కానీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారు. ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను మరింత ఎలివేట్ చేసి చూపించనున్నారని.. కథ మాత్రం ఒకటేనని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై పరోక్షంగా స్పందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ‘ప్యారడైజ్ వద్ద బస్సు దిగిన ప్రతి ఒక్కరూ బిర్యానీ తినలేరు’ అని రాసుకొచ్చారు.
ఆ విధంగా తన సినిమాపై వస్తోన్న వార్తలను ఖండించారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ ‘అవెంజర్స్’ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఇటీవల నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి..
వీఎఫ్ఎక్స్ పై వర్క్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 18న లేదంటే 2024 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా సినిమాను విడుదల చేయనున్నారు.