‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అలా ఉంటుంది, ఎలా ఉంటుంది.. అంటూ ఇన్నాళ్లూ పుకార్లు వినిపించాయి.. ఇప్పుడు ఆ పుకార్లు మారాయి, ప్రపంచం మొత్తం మనవైపు చూసే రోజు వచ్చింది అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ట్రైలర్‌లో చూపించిన కంటెంటే. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విజువల్స్, సెట్స్, కంటెంట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) మైమరిపించేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ చర్చ మొదలైంది.
ట్రైలర్‌లో చూసిన దాని ప్రకారం సినిమాను అశ్వత్థామ వర్సెస్ భైరవ వర్సెస్ యాస్కిన్ అని చెప్పొచ్చు అంటున్నారు. అంటే ఈ భూమి మీదకు కల్కి రావాలని ఎన్నో వేల సంవత్సరాలుగా ‘చిరంజీవి’ అశ్వత్థామ వెయిట్ చేస్తుంటారు. ఎట్టకేలకు పద్మావతి (దీపికా పడుకొణె) (Deepika Padukone) గర్భంలో ఆ కల్కి ఉదయిస్తున్నాడని తెలుసుకొని ఆమె కాన్పు సజావుగా జరిగేలా చూడాలి అనుకుంటాడు. అయితే అదే సమయంలో ఆ తల్లి, బిడ్డ తను కావాలని యాస్కిన్ సైన్యం చూస్తుంటుంది.
దీని కోసం బౌంటీలు సాధించి యూనిట్స్ (డబ్బులు) సంపాదించే భైరవ (ప్రభాస్)కు (Prabhas) ఆ పని అప్పజెబుతారు. దీంతో పద్మావతిని సజీవంగా కాంప్లెక్స్ (స్పెషల్ ప్లేస్)కు తీసుకెళ్లాలి అనుకుంటాడు. కానీ అశ్వత్థామ అడ్డుపడతాడు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమెను పట్టుకోవడానికి వచ్చిన భైరవనే కాపాడాల్సి వస్తుంది. పద్మావతి ఎవరు? ఆమె ఫెర్టిలిటీ ల్యాబ్‌లో ఎందుకుంది, ఎందుకు తప్పించుకుంది? అనేది ఇక్కడ కీలకం.
ట్రైలర్ చూపించే లోకం అంతా భవిష్యత్తు అని అర్థం చేసుకోవచ్చు. నీటి కోసం, ఆహారం కోసం కొంతమంది పెద్దలు, బలవంతులు ఇలా కాంప్లెక్స్ అని ఒకటి నిర్మించుకుని బలహీనుల్ని పీడించి బతుకుతుంటారు. ఈ క్రమంలో వాళ్ల నాయకుడికి అప్పుడే పుట్టిన బిడ్డల అవసరం ఉంటుంది. అదేంటి? అనేదే సినిమాలో కీలకం కావొచ్చు. అయితే విలన్ లుక్ సాధారణ మనిషిలా లేదు. దీనికి పసి బిడ్డలకు ఏదో లింక్ ఉంది అని చెప్పొచ్చు.