ఒక సినిమా విజయం సాధిస్తే… దాని నుండి పెద్దగా నేర్చకునేది ఉండదు అంటారు. బాగా చేశారు అనే మాటలు, జనాలు బాగా చూస్తే డబ్బుల మూటలు మాత్రమే వస్తాయి. అయితే ఒక సినిమా ఫ్లాప్ అయితే, డిజాస్టర్ అయితే నేర్చుకునే విషయాలు చాలానే ఉంటాయి అంటారు. కథ ఎంపిక నుండి, దర్శకుడు, సాంకేతిక నిపుణులు, నటులు, కథానాయకుడి ఆలోచన ఇలా చాలా అంశాల గురించి చర్చ జరుగుతుంది. అలా జరిగితేనే ఆ తర్వాతి సినిమాలో మంచి విజయం అందుతుంది.
ఈ చర్చ తరచుగా జరిగి హీరో ఆలోచనలో మార్పు రాకపోతే మాత్రం ఇబ్బందిపడొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ‘భోళా శంకర్’ సినిమా ఫలితం చూశాక చిరంజీవి ఆలోచనా విధానంలో మార్పులు అవసరం అనే మాట వినిపిస్తుండటమే. పాత్రల ఎంపిక విషయంలో చిరంజీవి ఆలోచన మారాలి, లేదంటే కథలో చిరంజీవిని చూపించే విధానంలో మార్పు రావాలి అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అభిమానులు సైతం ఇంచుమించు ఇదే మాట అంటున్నారు. అంతేకాదు బాలకృష్ణ ఫార్ములాను ఉపయోగిస్తే మంచిది అని కూడా అంటున్నారు.
అదే ఫార్ములా ఏంటి అనేది తర్వాత చూద్దాం. ముందు చిరంజీవి నుండి అభిమానులు ఏం ఆశిస్తున్నారు అనేది చూస్తే ఫార్ములా ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. చిరంజీవి టాలీవుడ్‌లో బెస్ట్ కమర్షియల్ స్టార్ హీరో. పాటలు, డ్యాన్స్‌లు, కామెడీ ఇలా అన్నీ చేయాలి. అలాంటి సినిమాలకే చిరంజీవి విజయాలు అందుతాయి. ఇలా కాకుండా ప్రయోగాలు చేసి, హీరోయిన్ లేకుండా, డ్యాన్స్‌లు చేయకుండా, కామెడీ పెట్టకపోతే విజయాలు అందవు. అలా అని మొత్తంగా అదే చేస్తే ఏజ్‌కి తగ్గ పాత్రలు కావు అంటున్నారు.
పై తరహాలో ‘గాడ్‌ఫాదర్’ సినిమా చేస్తే మంచి పేరు వచ్చినా.. చిరంజీవి మార్కు సినిమా కాదు అనే సణుగుడు వినిపించింది. ‘పాటలు, డ్యాన్స్‌లు, కామెడీ లేకుండా చిరంజీవి సినిమానా?’ అని కామెంట్స్ చేశారు. ‘ఆచార్య’ సినిమా చేసినప్పుడు కూడా ఇంచుమించు ఇలానే అన్నారు. అయితే ఆ సినిమా కథ, కథనం విషయంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి. ఇక ఇప్పుడు అన్నీ పెట్టి ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ చేస్తే ఈ ఏజ్‌లో ఈ పాత్రలు అవసరమా అంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఫార్ములాను చిరంజీవి పాటిస్తే బాగుంటుంది అని అంటున్నారు. అంటే డ్యూయల్ రోల్ చేసి ఒక చిరంజీవితో సీరియస్ రోల్ వేయించి ఒక స్టైల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలి. మరో రోల్‌లో యంగ్ లుక్ చూపించి ఆ స్టఫ్ కావాల్సిన వాళ్లకు ఇవ్వాలి. అప్పుడే ఇద్దరినీ ఎంటర్‌టైన్ చేయొచ్చు. బాలయ్య – బోయపాటి సినిమాలు ఇలా చేసి విజయాలు సాదిస్తున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య ‘వీర సింహా రెడ్డి’ ఇలా తెరకెక్కినదే.