తెలుగు తమిళ భాషల్లో అగ్రతారగా కొనసాగుతుంది నయనతార. వరుస చిత్రాలతో బిజీగా ఉంది నయన్. ఇక ఈమె నటించిన తాజా చిత్రం ‘కొలైయుదీర్ కాలం’ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మదియళగన్ నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగగా… ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు, రాజకీయ వేత్త, అయిన రాధారవి.. నయనతారని ఉద్దేశిస్తూ కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందు నిమిత్తం ఆయన్ని డీఎంకే పార్టీ నుండీ బహిష్కరించారు కూడా. అయితే ఈ క్రమంలో నయనతార బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేశ్ శివన్.. రాధారవి పై ఫైర్ అయ్యాడు. రాధారవి పై విమర్శలు చేసే క్రమంలో సినిమా పై, చిత్ర దర్శకనిర్మాతల గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం పెద్ద సమస్య వచ్చి పడింది.
‘కొలైయుదీర్ కాలం’ చిత్ర దర్శకనిర్మాతలు దాన్ని కొన్నేళ్ల క్రితం వదిలేశారు, ఆ చిత్రాన్ని సరిగ్గా తెరకెక్కించలేదు అని నేను భావించాను. అలాంటిది ఈ చిత్రానికి అనవసరమైన కార్యక్రమం నిర్వహించి ఇలాంటి వ్యక్తులను పిలిచారు. ఇలాంటి వాళ్ళు పాల్గొని ఏం మాట్లాడాలో కూడా తెలీకుండా… మాట్లాడారని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల కారణంగా ఈ చిత్రం సరిగ్గా రాలేదని ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు రావడం లేదట. ముందుగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు తమ డబ్బును వెనక్కి తిరిగివ్వాలని కోరుతున్నారట. దీంతో ఈ చిత్ర నిర్మాతలు చాలా నష్టపోయినట్లు చెబుతున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల ప్లాన్ చేసుకుంటే .. ఇప్పుడు విఘ్నేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమా బిజినెస్ దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డిజిటల్ రైట్స్ తీసుకుంటామని ముందుకొచ్చిన ప్రముఖ సంస్థ కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసిందట. దీనికి పూర్తి బాధ్యత… విఘ్నేశ్ భర్తీ చేయాలని.. లేని పక్షంలో ఈ వ్యవహారం పై కేసు వేయడానికి సిద్ధం అని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారట ఈ చిత్ర నిర్మాతలు. మరి ఈ ఇష్యూ పై విఘ్నేశ్ ఎలా స్పందిస్తాడో చూడాలి..!