కనీస స్థాయి అంచనాలు లేకుండా 2019లో విడుదలైన “జోకర్” సినిమా ప్రపంచంలోని సినిమా ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది. కేవలం 70 మిలియన్ డాలర్లతో రూపొందిన “జోకర్” ఏకంగా బిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన చిత్రం “జోకర్: ఫోలీ ఏ డ్యూయెక్స్”. ఈ రెండో భాగం మీద విపరీతమైన అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 02) విడుదలైన ఈ సినిమా మన భారతీయ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
Joker: Folie A Deux Review
కథ: లైవ్ షోలో హోస్ట్ ను మరియు ట్రైన్ లో ఇంకొంతమందిని కిరాతకంగా హతమార్చినందుకు ఆర్థర్ (జియోక్విన్ ఫీనిక్స్)ను జైల్లో పెడతారు. ఆర్థర్ స్ప్లిట్ పర్సనాలిటీతో బాధపడుతున్నాడని అతడి లాయర్ వాదించి, ఆర్థర్ ను మంచి హాస్పిటల్ లో చేర్చాలనుకుంటుంది. అయితే.. జైల్లో పరిచయమైన హార్లీ (లేడీ గాగా)తో ప్రేమలో పడిన ఆర్థర్ తన మనసు మార్చుకుని జైల్ గోడల నుండి బయటపడాలి అనుకుంటాడు.
అయితే.. ఆర్థర్ అలియాస్ జోకర్ ను జైల్లో ఉంచి మరణశిక్ష వేయాల్సిందిగా లాయర్ హార్వే డెంట్ విశ్వప్రయత్నం చేస్తుంటాడు. గోతం వెర్సెస్ జోకర్ కేసులో ఎవరు గెలిచారు? అసలు ఆర్థర్-జోకర్ ఒకరేనా లేక నిజంగానే స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “జోకర్: ఫోలీ ఏ డ్యూయెక్స్” చిత్రం.
నటీనటుల పనితీరు: పార్ట్ 1లో ఏ విధంగా అయితే తన నటనతో జోకర్ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడో.. ఈ సీక్వెల్లోనూ అదే స్థాయి నటనతో మంత్రముగ్ధుల్ని చేశాడు జియోక్విన్ ఫీనిక్స్. అతడి పాత్రలో ఉన్న లేయర్స్, అతడి పాత్ర లోలోపల జరిగే అంతర్యుద్ధాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. అయితే.. ఈసారి ఉత్తమ నటుడిగా ఆస్కార్ కాకపోయినా ఆ స్థాయి ప్రశంసలు అందుకోవడం ఖాయం.
ఊహించని విధమైన నటనతో ఆకట్టుకున్న నటి లేడీ గాగా. పాప్ సింగర్ గా అందరికీ సుపరిచితురాలైన ఆమె ఈ సినిమాలో హార్లీ క్విన్ పాత్రలో ఆశ్చర్యపరిచింది. ఆర్ధర్ లాయర్ గా కేథరీన్ కీనర్, హార్వే డెంట్ గా హ్యారీ లావ్లీలు అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ లారెన్స్ షేర్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ లో కవిభావం కనిపిస్తుంది. జోకర్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు, జోకర్ క్యారెక్టర్ ను అద్భుతంగా ఎక్ప్లోర్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే. హిల్డూర్ నేపధ్య సంగీతం వరకూ బాగున్నా.. పాటలు మాత్రం ఆడియన్స్ కు చిరాకు పుట్టిస్తాయి. “లా లా ల్యాండ్” లాంటి రొమాంటిక్ సినిమాలో పాటులున్నాయంటే జనాలు ఎంజాయ్ చేస్తారు కానీ.. “జోకర్” లాంటి సైకలాజికల్ డ్రామాలో పాటల్నే సంభాషణలుగా మార్చి ముందుకు తీసుకెళ్లడం అనేది ఆడియన్స్ బోర్ ఫీలయ్యేలా చేసింది.
“హ్యాంగోవర్” సిరీస్ తో ప్రేక్షకులను హిలేరియస్ గా ఆకట్టుకున్న దర్శకుడు టాడ్ ఫిలిప్స్ “జోకర్” పార్ట్ 1ను డైరెక్ట్ చేసిన విధానానికి ప్రపంచం మొత్తం హ్యాట్సాఫ్ చెప్పింది. అలాంటిది “జోకర్ 2”ను తెరకెక్కించిన విధానం మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం అనేది బాధాకరం. కథకుడిగా సమాజం మీద, మనుషుల వ్యక్తిత్వాల మీద సెటైరికల్ గా చాలా అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం అలరించలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, ఎస్.ఎఫ్.ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉన్నాయి. అయితే.. వరుసబెట్టి వచ్చే పాటల పుణ్యమా అని ఆ డిపార్ట్మెంట్స్ పడిన కష్టం అంతా వృథా అయ్యింది.
విశ్లేషణ: 2019లో “జోకర్” వచ్చినప్పుడు సినిమాలోని కవి భావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సమాజం ఒక మామూలు వ్యక్తిని పదే పదే వేలెత్తి చూపి ఒక సైకోగా ఎలా మారుస్తుంది? మాబ్ మెంటాలిటీ అంటే ఏమిటి? వంటి అంశాలను అద్భుతంగా చిత్రరూపంలో అందించేసరికి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. సెకండ్ పార్ట్ లో ఆ కనెక్టివిటీ మిస్ అయ్యింది. ముఖ్యంగా ప్రతి కీలకమైన అంశాన్ని, సందర్భాన్ని పాట రూపంలో ప్రెజంట్ చేయడం అనేది అందరికీ ఎక్కదు. అయితే.. “జోకర్” పాత్రతో సమాజం ఒక మనిషి కంటే మనిషిలోని మృగాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అనే అంశాన్ని ఎలివేట్ చేసిన తీరు మాత్రం ఒక చెరగని ముద్ర వేస్తుంది.
అలాగే లారెన్స్ సినిమాటోగ్రఫీ వర్క్ & ఫ్రేమింగ్స్ & మరీ ముఖ్యంగా కోర్ట్ రూమ్ బ్లాస్ట్ సీక్వెన్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. కానీ.. పార్ట్ 1తో పోల్చి చూస్తే మాత్రం నిరాశపరచడం ఖాయం.
ఫోకస్ పాయింట్: మనిషిలోని “జోకర్”ను వేలెత్తి చూపే ప్రయత్నం ఫలించలేదు!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus