టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలైన చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తాము కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 600 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, తారక్ సినిమాల విషయంలో వేగం పెంచారు. చరణ్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ ల షూటింగ్ లో పాల్గొంటుండగా తారక్ జూన్ నెల నుంచి వరుసగా సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారు.
అయితే తారక్ కొరటాల శివ కాంబో మూవీ వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తారక్ హీరోగా నటించి మార్చి నెలలో విడుదలైన ఆది, ఆర్ఆర్ఆర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మార్చి నెల తనకు అచ్చొచ్చిన నెల కావడంతో ఈ నెలలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను విడుదల చేయాలని తారక్ అనుకుంటున్నారు. మరోవైపు చరణ్ సైతం ఈ నెలపైనే దృష్టి పెట్టారని బోగట్టా.
చరణ్ శంకర్ కాంబో మూవీ 2023 సంవత్సరం సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఏదైనా కారణం వల్ల సంక్రాంతికి రిలీజ్ చేయడం సాధ్యం కాకపోతే ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చరణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లైన రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలు మార్చి నెలలోనే విడుదలై ఘనవిజయం సాధించాయి. మార్చి నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.
ఒకే నెలలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడుదలైతే ఒకరి సినిమాపై మరొకరి ప్రభావం ఉంటుందనే సంగతి తెలిసిందే. 2023 సంవత్సరం మార్చి నెలలో చరణ్, తారక్ పోటీ పడతారో లేదో చూడాల్సి ఉంది. రియల్ లైఫ్ లో స్నేహితులైన చరణ్, తారక్ కథ నచ్చితే భవిష్యత్తులో కూడా కలిసి సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ హీరోల కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.