కరోనా సెకండ్ వేవ్ వల్ల చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడాలేకుండా అన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా ఓటీటీలో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ కానుంది. అయితే దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో రిలీజవుతుందా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు.
అవేంజర్స్, జురాసిక్ పార్క్, బాహుబలి లాంటి విజువల్ వండర్స్ ను థియేటర్లలోనే చూడాలని అదే విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా కూడా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఎన్టీఆర్ పేర్కొన్నారు. థియేటర్లలో సమూహంగా చూసే సినిమా ఆర్ఆర్ఆర్ అని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిజమైన హీరోల గురించి తెలియాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమాలోని తన పాత్ర కొరకు ఎంతో పరిశోధన చేశామని ప్రస్తుతం ఆ కథలను తన పిల్లలకు కూడా చెబుతున్నానని తారక్ పేర్కొన్నారు.
తనకు మంచి కథలను నిర్మించాలనే ఆలోచన ఉందని ఇప్పటివరకు సినిమా డైరెక్షన్ గురించి ఆలోచించలేదని తారక్ తెలిపారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వస్తే ఎవరైనా చేస్తారని తనకు కూడా చేయాలని ఉందని ఎన్టీఆర్ తన మనస్సులోని కోరికను బయటపెట్టారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ ఇప్పటికీ అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు.