ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. మెగా, నందమూరి హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఈవెంట్ కు స్టార్ హీరో టోవినో థామస్ అతిథిగా హాజరు కాగా ఇకపై టోవినో థామస్ ను బ్రదర్ అని పిలుస్తానని తారక్ చెప్పుకొచ్చారు. తనకు, రాజమౌళికి మొదటి సక్సెస్ ను అందించింది మలయాళ అభిమానులే అని ఎన్టీఆర్ అన్నారు. తమ మొదటి ఇండస్ట్రీ హిట్ సింహాద్రి కేరళలో ఘన విజయాన్ని అందుకుందని తారక్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ కూడా అలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని బలంగా నమ్ముతున్నానని తారక్ కామెంట్లు చేశారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో కష్టపడ్డారని తారక్ చెప్పుకొచ్చారు. చరణ్ నాలో సగ భాగం అని ఎటువైపు అని అడిగితే ఎడమ భాగం అని తారక్ వెల్లడించారు. గుండె ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఇలా చెబుతున్నానని తారక్ చెప్పుకొచ్చారు. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రం కాదని తారక్ కామెంట్లు చేశారు. చరణ్ బ్రదర్ తో 200 రోజులు గడిపే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నానని తారక్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ తో చరణ్ కు, తనకు ఉన్న అనుబంధం ముగిసిందని అనుకోవద్దని తారక్ పేర్కొన్నారు.
మా బంధం ఇదే విధంగా ఉండాలని ఫ్యాన్స్ కూడా ప్రార్థించాలని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లాలని ఇద్దరి అభిమానులను కోరుకుంటున్నానని తారక్ అన్నారు. ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.