‘దేవర’ (Devara) సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. ప్రేక్షకుల్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఎలాగూ సినిమా ఫలితం.. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అని. మొదటి ప్రశ్నకు ఈ నెల 27న సమాధానం వస్తుంది. అయితే రెండో విషయంలో ఇప్పుడు సమాధానం వచ్చేసింది. అదే సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం రియాక్షన్. సినిమా రిలీజ్ నేపథ్యంలో టికెట్ రేటు పెంపు, అర్ధరాత్రి షోలకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ వచ్చేసింది. దీనికిగాను సినిమా టీమ్ థ్యాంక్యూ కూడా చెప్పేసింది.
ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దేవర’. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో సినిమా రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దేవర’ సినిమాకు స్పెషల్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కథానాయకుడు ఎన్టీఆర్, సినిమా టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు థ్యాంక్యూ చెప్పారు.
గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు అంటూ తారక్, కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) తదితరులు ట్వీట్లు చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్, అటు తెలుగుదేశం కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ, తారక్ దగ్గరైతే బాగుంటుంది అని వారి ఆలోచన కాబట్టి.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు చూస్తే.. అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28 నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో.. అప్పర్ క్లాస్ రూ.110 (జీఎస్టీతో కలిపి), లోయర్ క్లాస్ రూ.60 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ పెంచుకునే అవకాశం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలోనూ స్పెషల్ షోస్‌కి ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.