జ్యోతిక, సూర్యది లవ్ మ్యారేజ్ అని, తొలుత సూర్య వాళ్ల కుటుంబంలో ఒప్పుకోలేదని, తర్వాత కొన్నాళ్లకు ఒప్పుకున్నారని మనందరికీ తెలిసిందే. ఈ విషయం సూర్య, జ్యోతిక వివిధ సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే అన్నీ ఒకే అయ్యి ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక జ్యోతికను వాళ్ల అత్తయ్య ఓ కండిషన్ పెట్టారట. ఆ కండిషన్ చాలామందికి కొత్త కాకపోవచ్చు, అందులోనూ ఇంటర్ స్టేటస్ లవ్ మ్యారేజ్ వాళ్లకు ఇంకా కొత్త కాదు. ఇంతకీ ఆ కండిషన్ ఏంటి అనేగా ప్రశ్న. దానికి సమాధానం ఆమె మాటల్లోనే…
మనం ముందు చెప్పుకున్నట్లు జ్యోతికతో పెళ్లికి సూర్య ఇంట్లోవాళ్లు ఊ అనలేదు, ఊహూ అని కూడా అనలేదు. ‘కాక్క కాక్క’ సినిమా టైమ్‌లో సూర్య వాళ్లింట్లో ప్రేమ విషయం చెప్పారట. వాళ్లు వద్దనలేదు… కానీ ఓకే కూడా చెప్పలేదు. సూర్యవాళ్లది సంప్రదాయ తమిళ కుటుంబం. వాళ్ల నాన్న శివకుమార్ చిత్రపరిశ్రమలో క్రమశిక్షణ, కట్టుబాట్లకు మారుపేరు అంటుంటారు. అందుకేనేమో మా ప్రేమ, పెళ్లిగా మారడానికి చాలా సమయం పట్టింది. కొన్ని రోజుల తర్వాత సూర్య ఫోన్ చేసి… మన పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకున్నారని చెప్పాడు. అలా 2006లో పెళ్లి చేసుకున్నాం. ఇదీ జ్యోతిక పెళ్లి కథ. మరి పెళ్లి తర్వాత… అది కూడా చదివేయండి.
పెళ్లి అన్నాక జ్యోతిక అందరి అమ్మాయిల్లానే భయపడిందట. ప్రేమకి ఓకే చెప్పడానికే వీళ్లు నాలుగేళ్లు తీసుకున్నారు. ఇక ఇంట్లో అడుగుపెట్టాక ఎలా చూసుకుంటారో అని భయపడిందట. అయితే సూర్య తల్లిదండ్రులు జ్యోతికను కూతురిగా మార్చేసుకున్నారట. కాకపోతే, జ్యోతికకు వాళ్ల అత్తయ్య కండిషన్ పెట్టారట. మీ మావయ్యకి, నాకు ఇంగ్లీషూ, హిందీ పెద్దగా రావు. కాబట్టి నువ్వు మా భాష నేర్చుకోవాలి అని షరతు పెట్టారట. ఆమె మాటకు విలువిస్తూ ఇంట్లో పెట్టిన జ్యోతిక భలేగా తమిళం నేర్చుకుందట.