పోస్టర్స్ విషయంలో ముఖ్యంగా పెద్ద సినిమాల పోస్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. మేకర్స్ మనసులో ఎలాంటి ఆలోచనా లేకపోయినా కేవలం పోస్టర్ ను చూసి బోలెడన్ని ఊహించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు అలా ఊహించుకొంటూ ఏకంగా రజనీకాంత్ “కాలా” చిత్రాన్ని ఇబ్బందుల్లో పడేశారు నెటిజన్లు. “కాలా” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిటీలోని కొన్ని హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఒక పోస్టర్ లో రజనీకాంత్ కలం (ఇంక్ పెన్ను)ను విరగ్గొడుతున్నట్లుగా ఒక ఫోజ్ ఉంది. ఆ ఫోజ్ ను చూసిన కొందరు “కాలా ఏంటీ కలాన్ని వంచుతున్నాడు? అంటే రివ్యూల బెండు తీస్తున్నాడా?” అని ప్రశ్నిస్తున్నారు.
రజనీకాంత్ మునుపటి చిత్రం “కబాలి” బాగానే ఉన్నప్పటికీ.. కేవలం రివ్యూల కారణంగా సరిగా ఆడలేదన్న కోపంతో పా.రంజిత్ కావాలనే ఇలాంటి ఓ పోస్టర్ ను డిజైన్ చేయించాడని చెప్పుకొంటున్నారు కొందరు. ఇందులో ఏమాత్రం నిజం లేకపోయినా రిలీజ్ కి ముందు ఎందుకొచ్చిన పెంటరా బాబు అనుకొంటున్నారు “కాలా”మేకర్స్.