సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి రోబో తర్వాత మంచి విజయం లేదు. ఆయన నటించిన కొచ్చాడియాన్, లింగ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఈ సారి కచ్చితంగా విజయం అందుకోవాలని డాన్ నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నారు. కబాలి గా మన ముందుకు వచ్చారు. యువ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రేపు (22) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో .. ప్రీ రివ్యూలో వెల్లడిస్తున్నాం.
కథ ఏమిటంటే..
మనదేశాన్నీ బ్రిటీషులు పాలించే సమయంలో కొంతమంది తమిళులను ఆంగ్లేయులు మలేషియాకు తీసుకు పోతారు. అక్కడ తమ రబ్బరు ఫ్యాక్టరీలో కూలీలుగా పెట్టుకుంటారు. వారు పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా దారుణంగా హింసిస్తారు. ముసలి వాళ్లని కూడా జాలీ లేకుండా కొడుతుంటారు. ఇదంతా తెలుసుకున్న కబళేశ్వరన్ అనే తమిళ యువకుడు కబాలి గా మారి బ్రిటీష వాళ్లకు ఎదురుతిరుతాడు. వారిని పారిపోయేలా చేస్తాడు. అలా మలేసియాలో తమవారు ఎక్కడ ఇబ్బంది ఉన్నాప్రాణాలకు తెగించి రక్షిస్తాడు. అక్కడి తెలుగు వారికి కబాలి దేవుడవుతాడు. ఆ సమయంలోనే పేద యువతి (రాధికా ఆప్టే)ని చేరదీస్తాడు. పెళ్లిచేసుకుంటాడు. ఇద్దరికీ ఒక పాప కూడా పుడుతుంది. కబాలి పనులకు నష్టపోయిన స్థానిక డాన్ లు కలిసి, అతన్ని చంపాలని ప్లాన్ వేస్తారు. ఈ ఉచ్చులో కబాలి భార్య చచ్చి పోతుంది. ఆవేశంతో డాన్ లను చంపాలనుకునే లోపల పోలీసులకు చిక్కి, చేసిన నేరాలకు పాతికేళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. శిక్ష అనంతరం తిరిగి వచ్చి కూతురిని కలిసి, విలన్లను ఎలా చంపాడన్నదే కథ.
తెరపైన..
ఈ కథను దర్శకుడు పా. రంజిత్ మధ్య నుంచి మొదలు పెట్టాడు. పాతికేళ్ల శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన కబాలి తో సినిమాను మొదలు పెట్టి, ఒక్కొక్క ముడులు విప్పుకుంటూ వెళ్లాడు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ కీలక సమయంలో ఓపెన్ చేసి దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. యువకుడిగా మధ్య వయస్కుడిగా రజనీ ఎనర్జిటిక్ గా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో స్టైల్ చూపించి చప్పట్లు అందుకున్న సూపర్ స్టార్ ఎమోషన్ సీన్లో కంట తడి పెట్టించారు. కూతురిగా ధన్సిక నటన అద్భుతం. తండ్రి, కూతురికి మధ్య ఉండే సన్నివేశాలు బాగా పండాయి. అమాయకమైన అమ్మాయి పాత్రలో రాధికా ఆప్టే ఒదిగిపోయింది. విలన్ గా విన్స్ టన్ మలేషియన్ డాన్ గా మెప్పించాడు.
టెక్నీషియన్ల పనితనం
ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఇచ్చిన పాటలు తెరపైన మరింత బాగున్నాయి. బ్యా గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. సూపర్ స్టార్ ని అందంగా చూపించడంలోనూ, మలేషియా, బ్యాంకాక్ ప్రదేశాలను చక్కగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రాఫర్ మురళి సక్సస్ అయ్యాడు. సినిమా వేగంగా సాగడంలో ప్రవీణ్ ఎడిటింగ్ ప్రతిభ దాగుంది. ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులకే కాదు, సినీ ప్రియులందరికీ నచ్చేలా తీయడంలో కబాలి బృందం విజయం సాధించింది.