తెలుగు ప్రేక్షకులకు నటి కాకినాడ శ్యామలను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతంలో తెలుగు, తమిళ భాషల్లో ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఈమె 200 కి పైగా సినిమాల్లో నటించింది. రంగస్థలం నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ‘మరో చరిత్ర’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.అటు తర్వాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘నాలుగు స్తంభాలాట’, ‘ఆనంద భైరవి’, ‘మయూరి’, ‘బాబాయ్ అబ్బాయ్’.. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది శ్యామల.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సీనియర్ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ‘మరో చరిత్ర’ తో నా సినీ జీవితం మొదలైంది. నటిగానే కాకుండా నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించాను. ఒకప్పటి స్టార్ హీరో అయిన కృష్ణంరాజు గారితో ‘నిత్య సుమంగళి’ అనే సినిమా తీశాను. అది బాగా ఆడింది కానీ డిస్ట్రిబ్యూటర్లు మోసం చేయడంతో డబ్బులు పోయాయి. అలాగే ‘పచ్చబొట్టు’ సినిమా తీశాం. అప్పుడు మళ్లీ డిస్ట్రిబ్యూటర్తో విబేధాలు రావడంతో సినిమా రిలీజ్ కాలేదు.
ఈ పరిస్థితుల నడుమ నేను పెళ్లి చేసుకోవడం జరిగింది.మా ఆయనకు 600 ఎకరాలు రాసిచ్చారు మా మావయ్య గారు. అయితే మా ఆయన రసికుడు, పని పాటా లేదు.కొన్నేళ్లలోనే 600 ఎకరాలను 38 ఎకరాలు చేశాడు. నేను ఆయన్ను చాలా తిట్టేదాన్ని.. మగాడివైతే సంపాదించి భార్యాబిడ్డలకు పెట్టాలి. అలాంటి మగాడిని ఇష్టపడతాను. నా దృష్టిలో నువ్వు మగాడివే కాదని మొహం మీదే తిట్టాను. ఆయన 63 ఏళ్ల వయసులో చనిపోయారు’ అంటూ చెప్పుకొచ్చింది కాకినాడ శ్యామల.