నటుడిగా ‘నాయకుడు’ అనిపించుకొన్న కమల్ హాసన్ ఇప్పుడు నిజజీవితంలోనూ ‘నాయకుడు’ అనిపించుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు. గత కొన్నేళ్లుగా ‘త్వరలోనే రాజకీయ ప్రస్థానం మొదలు’ అంటూ తన అభిమానులనే కాక పలు రాజకీయ పార్టీలను కూడా వెయిటింగ్ లో పెట్టిన కమల్ హాసన్ ఎట్టకేలకు తన రాజకీయ రంగప్రవేశాన్ని కన్ఫర్మ్ చేశాడు. నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సమావేశంలో తన పార్టీ పేరుతోపాటు గుర్తును రివీల్ చేశారు. ఆరు చేతులు ఒకదాన్నోకటి పట్టుకొన్నట్లుగా ఉన్న లోగో స్నేహభావానికి ప్రతీకగా నిలుస్తుంటే.. పార్టీ పేరుగా “మక్కల్ నీధి మాయం”ను కన్ఫర్మ్ చేశారు. దీని అర్ధం “పీపుల్ జస్టిస్ పార్టీ”. ప్రజలకు న్యాయం చేయడం కోసం పెట్టిన పార్టీ ని తన పార్టీ పేరుతోనే అందరికీ అర్ధమయ్యేలా చేశాడు మన లోకనాయకుడు కమల్ హాసన్.
పార్టీ జెండా ఆవిష్కారం అనంతరం జరిగిన మీటింగ్ లో “నాకు షాల్ కప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనే మీకు షాల్ లాంటోడిని” అని కమల్ హాసన్ పేర్కొనడం అభిమానుల ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది.
ఇకపోతే.. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, కన్నడంలో ఉపేంద్రలు రాజకీయ రంగప్రవేశం చేసి ఎవరి పార్టీ వారు సొంతంగా స్థాపించడంతో రాజకీయాలకు గ్లామర్ యాడ్ అవ్వడంతోపాటు.. ప్రస్తుతం రూలింగ్ లో ఉన్న పార్టీలకు, అపోజిషన్ పార్టీలకు “ఓట్ల చీలిక” భయం కూడా ఏర్పడింది. మరి ఈ నలుగురు హీరోలు కథానాయకులుగా నెగ్గుకొచ్చినట్లు.. నాయకులుగానూ గెలుస్తారా లేదా అనే విషయం త్వరలోనే తెలిసిపోనుంది. ఏదేమైనా వీరి రాజకీయ రంగప్రవేశం దుమ్ము, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయిన రాజకీయాల్లో కనీస స్థాయి మార్పులు తీసుకువస్తుందని ఆశిద్దాం.